హనీట్రాప్‌లో థియేటర్‌ ఓనర్‌ | - | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌లో థియేటర్‌ ఓనర్‌

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

రూ.25 లక్షలు, అర్ధ కేజీ

బంగారం వసూలు

5 మంది మహిళల ముఠా అకృత్యం

దొడ్డబళ్లాపురం: సినిమా థియేటర్‌ యజమానిని హనీట్రాప్‌ చేసిన 5 మంది మహిళలు రూ.25 లక్షలు, అర్ధకేజీ బంగారం దోచుకున్న సంఘటన బెంగళూరు వద్ద రామనగరలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రామనగర పట్టణంలోని అగ్రహార కాలనీ నివాసి (52) స్థానికంగా ఒక సినిమా థియేటర్‌ కలిగి ఆర్థికంగా సెటిలై ఉన్నాడు. ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో థియేటర్‌కి సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ అతడితో పరిచయం చేసుకుని దగ్గరయ్యింది. తరువాత మరో నలుగురు మహిళలను పరిచయం చేసింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా బాధితుడు నిరాకరించాడు. దీంతో అతని మీద అత్యాచారం, పోక్సో కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి పలు విడతల్లో రూ.25 లక్షలు దోచుకున్నారు. 500 గ్రాముల బంగారం కూడా లాక్కున్నారు. అంతటితో ఆగక ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కావాలని వేధిస్తూ ఉండడంతో బాధితుడు ఐజూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళల కోసం గాలింపు చేపట్టారు.

ఉద్యోగం తీసేశాడని...

మేనేజర్‌ను చంపిన కూలీ

దొడ్డబళ్లాపురం: పనిలో నుంచి తీసేశాడనే కోపంతో ఒక కార్మికుడు.. మేనేజర్‌ని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. తిగళరపాళ్యలో ఉన్న పవర్‌ ప్లాస్టెక్‌ ఫ్యాక్టరీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న యాదగిరికి చెందిన హనుమంతు అనే కార్మికుడు సక్రమంగా పనికి రావడం లేదని మేనేజర్‌ రాహుల్‌ (38) పనిలో నుండి తొలగించాడు. దీంతో రాహుల్‌పై పగ పెంచుకున్న హనుమంతు సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలోనే రాహుల్‌ను 10 సార్లు కత్తితో పొడిచి చంపాడు. రాజగోపాలనగర పోలీసులు నిందితుడు హనుమంతుని అరెస్టు చేశారు. మృతుడు రాహుల్‌ ఉత్తరప్రదేశ్‌వాసి అని తెలిసింది.

నేత్రపర్వంగా హనుమంతోత్సవం

బొమ్మనహళ్లి: హాసన్‌ జిల్లాలోని ప్రసిద్ధ బేలూరు పట్టణంలో వెలసిన శ్రీ చన్నకేశవస్వామి ఆలయ ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి దివ్య హనుమంతోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు మంగళవాయిద్యాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మహామంగళారతిని నిర్వహించారు. ఆ తర్వాత, విద్యుత్‌ దీపాలు, పువ్వులతో అలంకరించిన చన్నకేశవ, సౌమ్య నాయకి, రంగ నాయకి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఒక భారీ కంచు ఆంజనేయ విగ్రహంపై ఉంచి ఆలయంలోని ఎనిమిది రాజ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.

రోడ్డుపై కారు దగ్ధం

దొడ్డబళ్లాపురం: కదులుతున్న కారులో మంటలు చెలరేగి రోడ్డుమీదే కాలిబూడిదైన సంఘటన దేవనహళ్లి శివారులో హొసకోట–దాబస్‌పేట మార్గంలో జరిగింది. కారు రహదారిపై వేగంగా వెళ్తుండగా హఠాత్తుగా ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చాయి. దీంతో కారులో ఉన్నవారు కారు ఆపి దిగిపోయారు. చూస్తుండగానే కారు కాలిపోయింది. ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎండలకు ఇంజిన్‌ అధికంగా వేడెక్కి ఉంటుందని అనుమానాలున్నాయి. దేవనహళ్లి ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement