
యూరియా.. కటకట తీరేదెలా?
సాక్షి,బళ్లారి: ఈసారి వరుణుడి కృపా కటాక్షాలతో తుంగభద్రమ్మ కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్యాం జూన్ నెలాఖరులోపే నిండిపోయి, హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయడంతో పాటు డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల దాకా నీరు నదికి వదులుతున్నారు. దీంతో రైతులు ఉత్సాహంగా వరినాట్లు వేసే ప్రక్రియ జోరందుకుంటోంది. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో 10 లక్షలకు పైగా ఎకరాల్లో, నాన్ ఆయకట్టు పరిధిలో 5 లక్షల ఎకరాలు సాగులో ఉంటే అందులో 10 లక్షలకు పైగా ఎకరాల్లో వరినే ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తారు. వరిసాగు చేయడానికి రైతులు బురదమళ్లు దుక్కులు దున్ని, వరినాట్లు వేయడానికి వరినారు సిద్ధం చేసుకుని ఉత్సాహంగా కదుతులున్న తరుణంలో రైతులకు కొత్త సమస్య వచ్చి పడింది.
ఎరువు వేస్తే ఏపుగా పంట పెరుగుదల
వరినాట్లలో ప్రధానంగా డీఏపీతో పాటు యూరియా వేస్తే వరినాట్లు బాగా నిలబడి, వరి పైరు ఏపుగా పెరిగేందుకు, పచ్చగా ఉండేందుకు అన్ని విధాలుగా పోషకాలు అందించేందుకు వీలవుతుందన్న ఉద్దేశ్యంతో రైతులు వరినాట్లు వేసే రోజునే యూరియా, డీఏపీ రెండూ కలిపి వేయడం ఆనవాయితీగా వస్తోంది. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేస్తారని తెలిసినా కూడా ఆయకట్టు పరిధిలోని రైతులకు రసాయనిక ఎరువులను సిద్దం చేయడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు కింద నాలుగు జిల్లాల పరిధిలో ఆయా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కొరత లేదని పైకి చెబుతున్నారే కాని వాస్తవంగా రైతులకు తగినంత దొరకడం లేదని రైతు సంఘం నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.100లకు పైగా అధికంగా అందించిన వారికి అక్కడక్కడ కొంత మేరకు లభ్యం అవుతోందని తెలుస్తోంది.
యథేచ్ఛగా యూరియా అమ్మకాలు
బ్లాక్‌మార్కెట్‌లో యూరియా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో యధేచ్ఛగా యూరియాను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత ఏర్పడుతుందని అధికారులకు, పాలకులకు ముందుగా తెలిసినా నిర్లక్ష్యంగా ఉండటంతోనే రైతులకు సమస్య ఏర్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారే కాని రైతులకు యూరియా సమస్య తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గట్టి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. జూలై మొదటి వారం నుంచే తుంగభద్ర ఆయకట్టు పరిధిలో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆయకట్టు పరిధిలో లక్షలాది ఎకరాల్లో ఎక్కడ చూసినా వరినాట్లు వేయడంలో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో రైతులకు అవసరమైన ఎరువులు అందించడంపై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల బాధలు వర్ణనాతీతం
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి సాక్షితో మాట్లాడుతూ వరినాట్లలో యూరియా వేసేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయన్నారు. యూరియా కొరత ఏర్పడుతుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. అఽయితే అధికారులు సిద్ధం చేశామని చెబుతున్నారే కాని ఎక్కడ సిద్ధం చేశారని ప్రశ్నించారు. సిద్ధం చేసిన యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు తగినంత యూరియా అందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు సమస్యలపై నైతిక బాధ్యత వహించాలన్నారు. తక్షణం సంబంధిత అఽధికారులు, పాలకులు చొరవ తీసుకుని రైతులను యూరియా సమస్య నుంచి గట్టెక్కించాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలో యూరియా డీలర్లు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
ఎరువుల కోసం అన్నదాతల అగచాట్లు
బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు
కొనుగోలు చేస్తున్న వైనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కర్షకుల మండిపాటు
సమస్యను పట్టించుకోని పాలకులు, అఽధికారులు

యూరియా.. కటకట తీరేదెలా?

యూరియా.. కటకట తీరేదెలా?

యూరియా.. కటకట తీరేదెలా?