
అసౌకర్యాల నడుమ రైల్వే స్టేషన్
రాయచూరు రూరల్: అసౌకర్యాలకు నిలయంగా రాయచూరు రైల్వే స్టేషన్ మారింది. నాలుగేళ్ల క్రితం ఉత్తమ రైల్వే స్టేషన్‌గా పేరొందిన రాయచూరు నేడు అపరిశుభ్రతకు నెలవుగా ఉండి ప్రయాణికులు అసహ్యించుకునేలా ఉంది. క్యాంటీన్ వెనుక, ఇతర చోట్ల, మరుగుదొడ్లు గుట్కా, పాన్ మసాల ఉమ్ములతో నిండాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు మౌనం వహిస్తున్నారు. మరుగుదొడ్లకు తాళాలు వేయడం, శుభ్ర పరచక పోవడం కనిపిస్తోంది. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత, పరిమాణాలకు తిలోదకాలిచ్చారు. ఆహార పదార్థాల విక్రయం విషయంలో లైసెన్సులు లేని వారు ఆదోని నుంచి యాదగిరి వరకు అమ్ముతున్నారు. మరో వైపు బోరుబావి నీటిని నింపి కూలింగ్ వాటర్ పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. స్టేషన్‌లో ఏసీ గదులున్నా ప్రయాణికులకు ప్రవేశం కల్పించడం లేదు. ప్రయాణికుల సమస్యలపై స్పందించాల్సిన రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, రైల్వే బోర్డు సభ్యులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
సౌకర్యాల కల్పనపై అధికారుల మౌనం
అపరిశుభ్రతకు నిలయంగా మారిన వైనం