పొలంలో యువకుడి దారుణ హత్య
సాక్షి,బళ్లారి: పొలంలో పని చేస్తున్న ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా నరోణలో జరిగింది. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న చెన్నవీర(26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే నరోణ పోలీసులు హుటాహుటిన చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు. కలబుర్గిలో కలకలం రేపిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పిస్తోల్‌తో కాల్చుకుని
యువకుడు బలవన్మరణం
సాక్షి,బళ్లారి: తండ్రి వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో తలకు కాల్చుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం విజయపుర నగరంలో జరిగింది. అక్కడి శికారిఖానాలో నివాసం ఉంటున్న మాజీ కార్పొరేటర్ ప్రకాష్ మీర్జా కుమారుడు ఆశారాం మీర్జా(22) అనే యువకుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీని తీసుకుని బెడ్‌రూంలో తలలోని కణతకు కాల్చుకుని కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. తుపాకీతో యువకుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలియగానే డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
హుబ్లీ: హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి గ్రామంలో ఓ మహిళ శవంగా లభ్యమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని కుందగోళకు చెందిన పుష్పా బిళేబాల(30)ను మృతురాలిగా గుర్తించారు. మహిళ భర్త రామజ్జ గురువారం కుందగోళ నుంచి తాలూకాలోని జుండూర గ్రామానికి పెళ్లి కార్యం కోసం భార్యను తీసుకెళ్లి ఇంగళహళ్లిలో వదిలి వచ్చాడు. సాయంత్రం భారీగా వర్షం పడటంతో పిడుగు పడి మృతి చెంది ఉండవచ్చని ఆ మహిళ తండ్రి విరుపాక్షప్ప దయన్నవర హుబ్లీ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాగులో వృద్ధురాలి మృతదేహం
కాగా మరో ఘటనలో ఓ వృద్ధురాలి శవం నగరంలోని నారాయణ చోప దగ్గర కర్కివాగులో లభించింది. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న ఈమె గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో కర్కివాగు వరద ప్రవాహంలో శవం కొట్టుకొచ్చింది. ఈమె ఆచూకీ లభించలేదు. శవాన్ని కేఎంసీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొన్నట్లు కసబాపేట పోలీసులు తెలిపారు.
డిపో మేనేజర్ వేధింపులతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
రాయచూరు రూరల్: ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులను భరించలేక ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం రాత్రి రాయచూరు జిల్లా లింగసూగూరు ఆర్టీసీ డిపోలో జరిగింది. వివరాలు.. లింగసూగూరు ఆర్టీసీ డిపోలో హైదరాబాద్ వెళ్లి వచ్చే బస్సుకు అబ్దుల్ శిరూరు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి కండీషన్ లేని పాత బస్‌ను అప్పగించి బలవంతంగా అదే డ్యూటీని వేసి అదే బస్సుకు వెళ్లాలని డిపో మేనేజర్ రాహుల్ హునసూరే సూచించాడు. పైగా కిలోమీటర్ పర్ లీటర్(కేఏంపీఎల్)ను తేవాలని ఒత్తిడి చేయడమేగాక నానా విధాలుగా వేధిస్తుండటంతో పాటు మానసికంగా బెదిరిస్తున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడంతో మనస్తాపం చెందిన అబ్దుల్ శిరూరు డిపో మేనేజర్ ముందే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతనిని సహోద్యోగులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు.
నరేగ పనులపై పర్యవేక్షణ
రాయచూరు రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న నరేగ పనులపై పర్యవేక్షణకు కేంద్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకంలో జరుగుతున్న పనులపై పరిశీలిస్తున్న నేపథ్యంలో జెడ్పీ ప్రణాళికాధికారి శరణ బసవ, శివశంకర్, అవనేంద్ర కుమార్ పీడీఓ, కార్యదర్శులపై మస్కి తాలూకా పామన కల్లూరు, చించిరమడిలో దాడులు చేశారు. కవితాళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
పొలంలో యువకుడి దారుణ హత్య


