వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణపై కదం
సాక్షి,బళ్లారి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు తీవ్ర ఆందోళన, నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. సోమవారం నగరంలోని ముస్లిం సోదరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. నగరంలోని మోతీ సర్కిల్ నుంచి రాయల్ సర్కిల్ వరకు వేలాది మంది ముస్లిం సోదరులు ర్యాలీగా వచ్చి ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ చేయడం దారుణం అని ముస్లిం సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు.
బీజేపీ ధోరణి కక్షపూరితం
ముస్లింలపై బీజేపీ కక్షపూరిత ధోరణిలో పని చేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లును సవరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది కోట్లాది మంది ముస్లింలకు వ్యతిరేకంగా, వారికి అన్యాయం చేయడానికి చేసిన పన్నాగం అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. బళ్లారిలో ప్రారంభమైన ఆందోళనను ఢిల్లీ పెద్దల వరకు చేరుస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కచ్చితంగా మోదీకి, బీజేపీ తగిన గుణపాఠం చెబుతారన్నారు. బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లుపై సవరణకు వ్యతిరేకంగా ముస్లింలే కాకుండా హిందువులు కూడా వేలాది మంది వచ్చారన్నారు. దేశంలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా ఉన్నారని, అయితే బీజేపీ నాయకులు మాత్రం విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి కలలు సాకారం కాబోవన్నారు. హిట్లర్ తరహాలో బీజేపీ పని చేస్తోందన్నారు. లోక్‌సభ సభ్యుడు తుకారాం, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, మైనార్టీ నేతలు హుమయూన్ ఖాన్, పాలికె కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వేలాది మంది ముస్లిం సోదరుల ఆందోళన
ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు,
కార్యకర్తలు
వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణపై కదం


