చెరుకు రైతులకు రూ.16 వేల కోట్ల చెల్లింపులు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రం చెరుకు పంటలో ముందడుగు వేస్తోంది. విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. 2024–25 సంవత్సరంలో రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీలు చెరుకు రైతులకు రూ.16,741 కోట్ల బిల్లులు చెల్లించగా ఇంకా రూ.1,832 కోట్లు బకాయి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.3,400 మద్దతు ధర నిర్ణయించింది. ఆ ధరనే చక్కెర ఫ్యాక్టరీలు చెల్లించినట్లు సమాచారం. రాష్ట్రంలో బెళగావి, బాగలకోటె, విజయపుర, బీదర్ జిల్లాలతో పాటు కృష్ణానది తీర ప్రాంతాల్లో చెరుకు పంటను గతంలో కంటే ఎక్కువ ఎకరాల్లో పండిస్తున్నారు. బాగలకోట జిల్లాలో కొందరు రైతులు గతంలో ఎకరాకు 40 టన్నులు చెరుకు దిగుబడి తీస్తుండగా ఇప్పుడు 80 టన్నులు తీస్తున్నారు.
79 చక్కెర ఫ్యాక్టరీలు
ఈ ఏడాది 90 శాతం రైతులకు చక్కెర ఫ్యాక్టరీలు బిల్లులు చెల్లించాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 79 చెరుకు ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలు అన్నీ కలిపి రోజుకి 5,60,850 టన్నుల చెరుకు ఉపయోగించి చక్కెరను ఉత్పత్తి చేస్తున్నాయి. 2024–25 ఏడాదిలో మొత్తంగా 52.20 కోట్ల టన్నుల చెరుకు ఉపయోగించాయి. దేశంలో చక్కెర ఉత్పత్తిలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది.


