బ్రాహ్మణులను అవమానించారు
రాయచూరు రూరల్: జంధ్యం విషయంలో బ్రహ్మణులను అవమానించడం ఖండనీయమని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ అన్నారు. స్వామీజీ అదివారం మంత్రాయలంలో పాత్రికేయులతో మాట్లాడారు. సీఈటీ పరీక్షలు రాసేందుకు వచ్చిన బ్రాహ్మణ సముదాయ విద్యార్థులను జంధ్యం తీయాలని హుకుం జారీ చేయడం బ్రాహ్మణ సముదాయాన్ని అవమానించడమేనని అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని మంటగలిపారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేశారని అరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్వామీజీ డిమాండ్ చేశారు.
ఇంట్లోకి చొరబడిన వ్యక్తికి దేహశుద్ధి
హుబ్లీః ఇంట్లోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈఘటన హుబ్లీలోని షిరిడినగర్‌లో ఆదివారం వెలుగు చూసింది. మద్యం తాగిన మత్తులో బసవరాజు అనే వ్యక్తి సవిత అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు బసవరాజును పట్టుకొని దేహశుద్ధి చేసి అశోకనగర పోలీసులకు అప్పగించారు.
నగలు, నగదు చోరీ
హుబ్లీ: దొంగలు ఓ ఇంటిలో చోరిబడి నగదు,నగలు చోరీ చేశారు. ఈ ఘటన పాత హుబ్లీ గుడిహాల రోడ్డు వాణి ప్లాటులో జరిగింది. అల్లా ఉద్దీన్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లాడు. పసిగట్టిన దొంగలు లోపలకు చొరబడి రూ. లక్ష నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
డీవైడర్‌ను కారు ఢీకొని బాలిక మృతి
హుబ్లీః కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బాలిక మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన హుబ్లీ తాలూకాలోని తిరుమల కొప్ప గ్రామం వద్ద హైవేలో ఆదివారం చోటు చేసుకుంది. హవేరి నుంచి హుబ్లీకి వెళ్తున్న కారు అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న బెంగళూరుకు చెందిన అక్షర కులకర్ణి(8) తీవ్రంగా గాయపడగా ప్రాణేష్, వేదేహి తదితర ఏడుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్షర మృతి చెందింది. ఈ ఘటనపై హుబ్లీ గ్రామీణపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని...
హుబ్లీ తాలూకాలోని హిరేసూర గ్రామం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొని ఖాజానగర్ నివాసి బసవరాజ్ (51) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈయన నవలగుంద నుంచి హుబ్లీకి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బెళగావిలో బీసీఏ విద్యార్థిని అత్మహత్య
రాయచూరు రూరల్: మైనార్టీ సముదాయ యువకుడి వేధింపులతో బీసీఏ విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెళగావిలో చోటు చేసుకుంది. హవేరి జిల్లా శిగ్గావి తాలుకా చిక్క మల్లూరుకు చెందిన శిల్పా(22) బెళగావి మహంతేస్ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంటూ బీసీఏ చదువుతోంది. నవీన్ యువకుడిని ప్రేమించింది. నవీన్ శిగ్గావిలో ఫర్నీచర్ దుకాణంలో పనిచేసేవాడు. ఆ దుకాణ యజమాని రంజాన్ నదాప్ శిల్పాకు ఫోన్ చేసి వేధించేవాడు. మరో వైపు నవీన్‌పై దొంగతనం కేసు పెట్టించాడు. దుకాణంలో నగదును నవీన్ చోరీ చేసి నీకు ఇచ్చాడని శిల్పాకు రంజాన్ నదాప్ ఫోన్ చేసి వేధించేవాడు. దీంతో శిల్ప తానుంటున్న హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది.
వివాదాన్ని రాజేస్తున్న బీజేపీ
రాయచూరు రూరల్: జంధ్యం వివాదాన్ని బీజేపీ రాజేస్తోందని, దీని వెనుక బీజేపీ అధ్యక్షుడు విజేయేంద్ర హస్తం ఉందని మాజీ ఎమ్మెల్సీ అరవింద కుమార అరళి అరోపించారు. బీదర్‌లో రెండు పరీక్షలు రాసిన సుచివ్రత కులకర్ణి మూడవ పరీక్ష సమయంలో బీజేపీ జనాక్రోశ యాత్ర నేపథ్యంలో ఈ దుర్ఘటన సంభవించిందని, దీనికి బీజేపీనే ప్రధాన కారణమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కుల గణన చేపట్టిన కారణంగా ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని మరింత రెట్టింపు చేశారన్నారు.
బ్రాహ్మణులను అవమానించారు


