
ఉచిత కంటి వైద్య శిబిరం
పావగడ: స్థానిక స్వామి వివేకానంద గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోని శారదా దేవి కంటి చికిత్స విభాగంలో బుధవారం చిన్నారులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి వందలాది మంది చిన్నారులు తరలి వచ్చారు. ప్రముఖ నేత్ర చికిత్స వైద్యురాలు డాక్టర్ వసుంధర నరేశ్ కంటి పరీక్షలు చేశారు. 13 రోజుల శిశువు నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు చికిత్స అందించారు. ఈ శిబిరంలో 22 నెలల పసికందుకు రెండు కళ్లు లోపించడంతో తక్షణమే మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు స్వామి జపానంద తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
పావగడ: తాలూకా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని స్థానిక బీఈఓ ఇంద్రాణమ్మ తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 31 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు. పాఠశాలల్లో ఉచిత విద్య, ఉచిత యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, షూ, సాక్స్, మధ్యాహ్న భోజనం, పాలు, కోడి గుడ్డు, చిక్కి, అరటి పండ్లు ఉచితంగా అందిస్తామన్నారు. పాఠశాలల ప్రారంభం రోజున తీపి వంటకాలతో పిల్లలకు రుచికరమైన భోజనం వడ్డిస్తామని ఈసీఓ వేణుగోపాల రెడ్డి తెలిపారు.