రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో విద్యాశాఖ ప్రాధికారను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి వేదిక సంచాలకురాలు విద్యా పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024–25వ విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కొన్ని సర్కారీ ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో జూన్ 1 నుంచి పాఠశాలలను ఏ విధంగా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. జిల్లాలో 160 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక మూతపడే అవకాశాలున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రుల వెంట కూలి పనులకు వెళుతున్నారన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. మోక్ష మ్మ, శివరామరెడ్డి, మారెమ్మ, హఫీజుల్లాలున్నారు.