
యశవంతపుర: ఉడుపిలో ఒకే కుటుంబంలో నలుగురు దారుణహత్యకు గురైన ఘటనకు సంబంధించి మిస్టరీ వీడుతోంది. హసీనా (45), కూతుళ్లు అఫ్నాన్ (23), ఆజ్నాన్ (21), కొడుకు అసీమ్ (14) హత్యోదంతానికి సంబంధించి ప్రధాన నిందితుడు, మహారాష్ట్రలోని సాంగ్లికి చెందిన ప్రవీణ్ అరుణ్‌చౌగల్‌ను అరెస్ట్ చేసినట్లు ఉడుపి ఎస్పీ డాక్టర్ అరుణ్ తెలిపారు. ఒక అమ్మాయిని టార్గెట్ చేసి అడ్డు వచ్చిన మిగతావారిని కూడా నిందితుడు హతమార్చినట్లు తెలిపారు.
ఐదు బృందాలతో గాలింపు
హత్య జరిగిన అనంతరం నిందితుల కోసం ఐదు బృందాలు ఏర్పాటు చేశారు. ఉడుపి, మంగళూరు, శివమొగ్గ, కేరళలో గాలించారు. ఈక్రమంలో బెళగావి, ఉడుపి పోలీసులు ప్రధాన నిందితుడిని మంగళవారం రాత్రి బెళగావి జిల్లా రాయభాగ తాలూకా కుడుచి గ్రామంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి సెల్‌ఫోన్‌లోని కాల్‌డేటా, వాట్సాప్ వివరాలపై ఆరా తీయగా అతను మంగళూరు ఎయిర్‌పోర్టులో హతురాలు అజ్నాన్ కలిసి పని చేసినట్లు తేలింది. కొంతకాలంగా నిందితుడు అజ్నాన్‌ను ప్రేమిస్తున్నట్లు విచారణలో తేలింది.
కాగా ఆమెను హత మార్చాలని నిందితుడు పథకం పన్నాడు. అజ్నాన్‌ను హతమార్చిన తర్వాత అడ్డు వచ్చిన వారిని కూడా కడతేర్చినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే నిందితుడు చెబుతున్న విషయాలు వాస్తవమా? కాదా అనే విషయంపై విచారణ కొనసాగుతుందన్నారు. నిందితుడి మొబైల్‌లోని కాల్‌డేటా, సీసీకెమెరా ఫుటేజీల ఆధారంగా మరో 10 మంది అనుమానితులను ఉడిపి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కేరళలోని కొచ్చిలో ఒక అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు రెండుమూడు కారణాలు ఉండవచ్చని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment