ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి

లారీ ముందుభాగంలో దూసుకెళ్లిన కారు   - Sakshi

కర్ణాటక: ఇండికా కారు టైరుపేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా కుష్టగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కారుటైరు పేలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విజయపుర నుంచి ఆదివారం సాయంత్రం బెంగళూరుకు కారులో రాజప్పబనగోడి (21), రాఘవేంద్ర కాంబలే (24), అక్షయ శరవణ (21), జయశ్రీ (26), నాలుగేళ్లు వయసుగల రాశి, రక్షితలు బయలుదేరారు. జాతీయ రహదారి 50లో కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.

మరో రోడ్డులోకి దూసుకెళ్లి లారీని ఢీకొట్టింది. లారీ వేగంగా వస్తుండటంతో కారు లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీతో పాటు సీనియర్‌ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు డ్రైవరు నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇళకల్‌ వైపునకు లారీ వెళుతుండగా కారు ఢీకొట్టింది. కారును క్రేన్‌ సాయంతో బయటికి తీసి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కుష్టగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

మృతుల కుటుంబాలకు పరిహారం : సీఎం
ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం సిద్దరామయ్య తలా రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈఘటన దురదృష్టకరమని ట్వీట్‌ చేశారు. అజాగ్రత్తతోనే ఇలాంటి ప్రమాదాలకు కారణమని అన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top