మేడం! తిరుపతికి వచ్చినప్పుడు నెంబర్ ఇచ్చారు.. బంగారు నాణేలు ఉన్నాయి, కావాలా? ధర కూడా తక్కువే!

పెద్దవడుగూరు: మొదట రెండు అసలైన బంగారు నాణేలను ఇచ్చారు. ఇలాంటివే చాలా ఉన్నాయి, తక్కువ ధరకే అమ్ముతాం అని మహిళకు ఓ ముఠా టోకరా వేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల పరిధిలో జరిగింది. ఆమె నుంచి రూ.2 లక్షలు అపహరించారు.
బాధితులు తెలిపిన వివరాలు రెండు నెలల క్రితం సికింద్రాబాద్ కు చెందిన విష్ణుదీపిక నైనీ అలియాస్ గాయత్రీ అనే మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మేడమ్ మీరు నాకు తిరుపతికి వచ్చినప్పుడు నంబర్ ఇచ్చారు అని మాటలు కలిపాడు. మా వద్ద బంగారు నాణేలు ఉన్నాయి, తక్కువ ధరకే ఇస్తామని చెప్పడంతో అమాయకురాలు నమ్మి తీసుకురమ్మని చెప్పింది. మార్చి 7న కర్ణాటకలో హొసపేటె వద్ద 2 బంగారు నాణేలు ఇచ్చి కొంత డబ్బును తీసుకొని వెళ్లాడు.
ఈసారి 2 కేజీలు ఉన్నాయని చెప్పి..
మీరు నమ్మితే మా వద్ద సుమారుగా 2 కేజీల దాకా ఉన్నాయని చెప్పి వెళ్లాడు. మహిళకు మళ్లీ ఫోన్ చేయగా, నాణేలు తీసుకురండి అని గాయత్రీ చెప్పింది. దీంతో శనివారం గుత్తి దగ్గరలోని గేట్స్ కళాశాల వద్ద మహిళ, ఆమె కొడుకును మోసగాళ్లు కలిసి పెద్దసంఖ్యలో నకిలీ నాణేలను ఆమెకు అందజేసి, ఆమె నుంచి రూ.2 లక్షలు తీసుకొన్నారు. పోలీసులు వస్తున్నారని హడావుడి చేసి అక్కడి నుండి పరారీ అయ్యారు. మహిళ నాణేలను పరిశీలించగా అవి నకిలీవని తెలిసి గొల్లుమంది. పెద్దవడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వార్తలు :