సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ వైఫల్యాలపై కదం తొక్కాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ మొదటి నుంచి బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారిందన్నారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల విఫల పరిపాలన తర్వాత ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతోందని తెలిపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నుంచి నియోజకవర్గాలవారీగా పార్టీ క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను తెలుసుకున్నారు. సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, అవినీతిని కార్మికులకు తెలియజేయాలన్నారు. కరీంనగర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నేతలంతా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని, వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సతీశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు.


