వీధి వ్యాపారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ చిత్రమిశ్రా తెలిపారు. నగరంలోని కళాభారతిలో బుధవారం నిర్వహించిన స్వనిధి మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీధి వ్యాపారుల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ పీఎం స్వనిధి పథకం ద్వారా లభిస్తున్న అవకాశాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పీఎం స్వనిధి పథకం కింద మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కును 98 మంది లబ్ధిదారులకు అందజేశారు. కొత్త వీధి వ్యాపారులకు డిజిటల్‌ పేమెంట్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ అందించారు.

పుడ్‌స్టాళ్ల ఏర్పాటు

స్వనిధి మహోత్సవంలో భాగంగా కళాభారతి ఆవరణలో వీధి వ్యాపారులతో ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేశారు. సందర్శకులు స్టాళ్లలోని ఆహారపదార్థాలను రుచిచూశారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీ గౌస్‌ ఆలం, నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ పాల్గొన్నారు.

పలు నిర్మాణాలకు శంకుస్థాపన

కరీంనగర్‌ అర్బన్‌: నూతన కలెక్టరేట్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సుడా ఆధ్వర్యంలో హెలిప్యాడ్‌, సర్వీస్‌ రోడ్డు, హెలిప్యాడ్‌కు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసేందుకు బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.53లక్షల సుడా నిధులతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ చిత్రా మిశ్రా, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ శంకుస్థాపన చేశారు. కొత్త కలెక్టరేట్‌ నుంచి ఈశాన్యం గేట్‌ వరకు రహదారి అభివృద్ధి పనులు, గార్డెన్‌ సుందరీకరణ పనులు ప్రారంభించారు.

అధికారులపై ఎమ్మెల్యే గంగుల ఫైర్‌

కలెక్టరేట్‌లో పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగగా తనకు సమాచారమివ్వలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అసహనం వ్యక్తం చేశారు. సమాచారంతో పాటు ప్రొటోకాల్‌ పాటించడంలో అగౌరవపరచడం తగదని, మరోసారి పునరావృతం కావద్దని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement