కరీంనగర్ అర్బన్/కరీంనగర్(కొత్తపల్లి)/తిమ్మాపూర్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను అగ్రభాగాన నిలపాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టర్ చిత్రామిశ్రా 99 రోజుల కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6నుంచి జూన్ 12వరకు 10 ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా 4,290 ఫైళ్లు పరిష్కరించగా, 3,835 దరఖాస్తులు స్వీకరించామని, అరైవ్–అలైవ్ కార్యక్రమంలో 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మెగాజాబ్ మేళాలో 292 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, ప్రజావాణి ద్వారా వచ్చిన 2,995 దరఖాస్తుల్లో 2,144 పరిష్కరించినట్లు వివరించారు.
అంధ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
అంధ విద్యార్థులు విద్యను ఆయుధంగా చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సంగీత శిక్షణ గది, రికార్డు గదిని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎల్‌ఎండీకాలనీలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు నిర్వహిస్తున్న మేధో వికలాంగుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.


