విద్యాభివృద్ధికి హెచ్‌ఏఎల్‌ చేయూత | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి హెచ్‌ఏఎల్‌ చేయూత

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

విద్యాభివృద్ధికి హెచ్‌ఏఎల్‌ చేయూత ● సీఎస్‌ఆర్‌ నిధులు రూ.10 కోట్లతో ధర్మపురిలో డిగ్రీ కళాశాల నిర్మాణం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు కీలక అడుగుపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చొరవ ఫలితంగా బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో హెచ్‌ఏఎల్‌ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌, హెచ్‌ఏఎల్‌ హైదరాబాద్‌ చీఫ్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్స్‌ ఏవీ మురళీకృష్ణ, డీజీఎం (హెచ్‌ఆర్‌) సూర్యకాంత్‌ రౌత్‌, సీనియర్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) ఎస్‌.సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ..విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఈ డిగ్రీ కళాశాల వరంగా మారనుందని తెలిపారు. నూతన కళాశాల భవనం ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్‌ లెర్నింగ్‌ సదుపాయాలతో నిర్మించబడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. సీఎస్‌ఆర్‌ నిధులను సామాజికాభివృద్ధికి వినియోగిస్తూ విద్యారంగానికి హెచ్‌ఏఎల్‌ సంస్థ అందిస్తున్న సహకారానికి హెచ్‌ఏఎల్‌ యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, మంత్రి ఓఎస్డీ వైజే విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement