● వాహనం స్వాధీనం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తమ్మిశెట్టి రవీందర్‌కు చెందిన బైక్‌ను ఈనెల 19న అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన బోర్తుడి సంజీవ్ వాహన దొంగతనాలు చేస్తూ గతంలోనూ బెజ్జూరు, కాగజ్‌నగర్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో చోరీచేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. పెద్దపల్లికి చెందిన రవీందర్ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన బైక్‌ను సైతం అపహరించాడు. మంగళవారం శాంతినగర్ శివారు రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద వాహనతనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అప్రమత్తమై అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనం విషయం తెలుసుకుంది. నేరాన్ని అంగీకరించడంతో బైక్‌ను స్వాధీనం చేసుకుని, సంజీవ్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు.
భూపాల్‌పల్లి డీటీవో వెంకన్న మృతికి నివాళి
జగిత్యాలక్రైం: జిల్లాలో 27నెలలు ఎంవీఐగా పనిచేసి.. పదోన్నతిపై భూపాల్‌పల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా వెళ్లిన వెంకన్న సోమవారం ఉదయం టిప్పర్ ఢీకొని మృతిచెందడంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన వెంకన్న 2003లో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. కేటీపీఎస్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఏడీఏగా పదోన్నతి పొందారు. ఏపీపీఎస్సీలో పరీక్ష రాసి రవాణా శాఖలో ఎంవీఐగా ఉద్యోగం పొందారు. 15 రోజుల క్రితమే భూపాల్‌పల్లి డీటీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతిపై జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ సందాని, ఎంవీఐ రామారావు, అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్‌లు సంతాపం వ్యక్తం చేశారు.
అప్పుల బాధ తో వ్యక్తి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన బాలసాని బాలరాజు(40) ఆదివా రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బాలరాజు భార్య క్యాన్సర్ వ్యాధికి గురై మృతిచెందింది. ఆమె చికిత్స కోసం బాలరాజు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేక మనోవేదనకు గురైన బాలరాజు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి కుమారుడు, కూతురు అనాథలుగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం, మానవతవాదులు చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జ్యోతి తెలిపారు.


