పేషెంటుగా వచ్చి.. దొంగతనానికి యత్నించి | - | Sakshi
Sakshi News home page

పేషెంటుగా వచ్చి.. దొంగతనానికి యత్నించి

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

పెద్దపల్లిరూరల్‌: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. పేషెంటుగా ఆసుపత్రికి వచ్చిన ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలోని గదుల్లో జనం రద్దీ లేని డ్రెస్సింగ్‌ రూంలోకి చేరి అక్కడ ఉన్న కొంత సామగ్రిని సంచిలో వేసుకున్నాడు. అలాగే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది బ్యాగులో ఉంచిన సెల్‌ఫోన్‌ను కూడా అపహరించాడు. సీసీ కెమెరాలో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. పొరపాటు చేశానని, ఇకముందు ఇలాంటి తప్పులు చేయనని వేడుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సదరు వ్యక్తిని మందలించి వదిలేశారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామగుండం: రామగుండం టెంపుల్‌ రోడ్డులో నివాసముంటున్న మాచినేని రమేశ్‌ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిషన్‌ భగీరథలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ ఆదివారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రామగుండం రైల్వే వంతెనపై వెనుక నుంచి బొలేరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం ఎస్సై గుండేటి సంధ్యారాణి తెలిపారు.

కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో కుక్కల బెడద తీవ్రమవుతోంది. ఫలితంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఆదివారం కాశ్మీర్‌గడ్డ మైసమ్మ చెట్టు ప్రాంతంలో కుక్కలు దాడులకు దిగాయి. పలువురిని గాయపరిచాయి. కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలను నగరపాలకసంస్థ ప్రారంభించినప్పటికి, సరిపడా సంఖ్యలో చేసే పరిస్థితి లేకుండా పోయింది. కుక్కల బెడదను నివారించాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement