వేములవాడ: వేములవాడ భీమేశ్వరాలయంలో గల మానవ శిల్పాన్ని గతంలో ‘బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పం’గా భావించి ప్రచారం చేసినట్లు చరిత్ర పరిశోధకుడు, డిస్కవరీ మ్యాన్‌రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం తన అభిప్రాయాన్ని వెల్ల డించారు. భీమేశ్వరాలయంపై 30 రోజుల చాలెంజ్‌లో భాగంగా రూపొందించిన వీడియోల్లో ఆలయం అడుగుభాగంలో పడుకుని ఉన్న మానవ శిల్పాన్ని పొరపాటున బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పంగా పేర్కొన్నానని ఆయన చెప్పారు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దానిలో యజ్ఞోపవీతం (జంధ్యం) స్పష్టంగా కనిపించడంతోపాటు, శిల్పానికి చిరు బొజ్జ కూడా చెక్కి ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ రెండు లక్షణాలు హిందూ భక్తుని రూపాన్ని సూచిస్తున్నాయని, బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పాల్లో ఇటువంటి లక్షణాలు సాధారణంగా కనిపించవని అభిప్రాయపడ్డారు. భీమేశ్వరాలయం ఆది నుంచి శైవక్షేత్రంగానే కొనసాగిందని, ఇప్పటివరకు ఈ ఆలయం బౌద్ధారామంగా లేదా జైన దేవాలయంగా ఉన్నట్లు నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. పురావస్తు, చారిత్రక అంశాలపై పరిశోధనలు చేసే సమయంలో కొత్త ఆధారాలు లభించినప్పుడు గత అభిప్రాయాలను సవరించుకోవడం పరిశోధనలో సహజ ప్రక్రియేనని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం పరిశోధకుల బాధ్యత అని పేర్కొన్నారు.
టేకు కలప పట్టివేత
మానకొండూర్: మానకొండూర్ మండలంలోని రంగపేట సర్పంచ్ ఇంటి వద్ద ట్రాక్టర్‌లో ఉన్న కలపను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. సర్పంచ్ కొత్త రాంరెడ్డి ఇంటి వద్ద టేకు కలప ట్రాక్టర్‌లో లోడుతో ఉన్న సమాచారాన్ని ఫారెస్టు అధికారులు తెలుసుకుని శనివారం అర్ధరాత్రి దాటాక దాడిచేసి పట్టుకున్నారు. పోలీసుల పర్యవేక్షణలో ట్రాక్టర్‌ను కరీంనగర్ కార్యాలయానికి తరలించారు.


