సర్వే చేయాలంటే చేతులు తడపాల్సిందే
సైదాపూర్ సర్వేయర్ ఏసీబీ ఘటనతో కలకలం
హద్దుల గొడవ.. పేరుకుపోతున్న అర్జీలు
16 మండలాలకు 7 డీజీపీఎస్‌లేనా?
‘భూమి సర్వే చేసేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి ఏసీబీకి పట్టుబడ్డాడు. తన భూమిని సర్వే చేయాలని సుంచు మహేందర్ సర్వేయర్‌ను సంప్రదిస్తే రూ.25వేలు డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించాడు. తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు’.
గంగాధరకు చెందిన రాజిరెడ్డి తన భూమి సర్వే కోసం 5నెలల క్రితం దరఖాస్తు చేశాడు. నేటికి కొలత కాకపోగా కార్యాలయాల చుట్టూ తిరగడం, నిరాశగా వెనుదిరగడం తంతుగా మారుతోంది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. జిల్లాలో వందల మందిది ఇదే పరిస్థితి.
కరీంనగర్ అర్బన్: పెరుగుతున్న భూముల విలువ సర్వేయర్లకు కాసులు కురిపిస్తోంది. హద్దు పంచాయితీలు పెరుగుతుండగా, సర్వేయర్లే సమస్యలు సృష్టిస్తున్న ఘటనలు అనేకం. శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి పట్టుబడటం అందుకు మచ్చుతునక కాగా హెచ్చు సర్వేయర్లది ఇదే దారని స్పష్టమవుతోంది. ఒకప్పుడు సోదర భావంతో ఉన్న చుట్టుపక్కల రైతులు ఇప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. హద్దుల గొడవ తేల్చాల్సిన సర్వే లాండ్ రికార్డులశాఖ మామూళ్లకే పెద్దపీట వేస్తుండటం గమనార్హం.
కొలత ఎప్పుడయ్యేనో..?
జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలుండగా భూ సర్వే ఆర్జీల సంఖ్య తగ్గకపోవడం విడ్డూరం. పలువురు సర్వేయర్లు మామూళ్లు ఇచ్చినవారికే ప్రాధాన్యతనిస్తుండగా ఎవరెక్కువ ఇస్తే వారి హద్దులనే నిర్ణయిస్తున్నారన్న విమర్శలు కోకొల్లలు. కరీంనగర్ అర్బన్, వీణవంక మండలాలకు ఇన్‌చార్జి సర్వేయర్లు ఉండగా మిగతా మండలాలకు సర్వేయర్లు ఉన్నా అర్జీలు వందల్లో పేరుకుపోవడం పనితీరుకు తార్కాణం. గతంలో సగం మంది పోటీ పరీక్షల కోసం దీర్ఘకాల సెలవులో వెళ్లగా తిరిగి విధుల్లో చేరారు. యుద్ధప్రతిపాదికన సర్వే చేయాల్సిన సర్వేయర్లు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా 300కు పైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
బేరం కుదిరితేనే కొలత
జిల్లాలోని పలువురి సర్వేయర్ల తీరు విమర్శలకు తావిస్తోంది. రూపాయి లంచం లేకుండా హద్దులు నిర్ణయించాల్సి ఉండగా కాసుల బేరంతో కాలయాపన చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బార్‌లలో రేట్లు మాట్లాడుకోవడం బేరం కుదిరితేనే కొలత వేయడం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. ఇక కారులో వస్తే ఒక రకం, ఇతర వాహనంలో వస్తే మరో రకం ఫీజు కాగా.. కోరిన భోజనం సమకూర్చాల్సిందే. సర్వేయర్‌కు తోడుగా వచ్చేవారికి లంచం ఇవ్వాల్సిందే. లేదంటే టీపాన్ సరిగా లేదని సర్వేను వాయిదా వేస్తున్నారు. ఇక కార్యాలయంలో టీపాన్, నక్షా, తదితర అవసరాలుంటే డబ్బులతో ముడిపెడుతుండటం విడ్డూరం. ఈ విషయంలో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కరవయ్యాయి.
డీజీపీఎస్ ఇస్తేనే సత్వర సేవ
జిల్లాలో ఏడు మాత్రమే డీజీపీఎస్‌లున్నాయి. మరో రెండు పైలట్ సర్వేలో వినియోగిస్తున్నారు. గొలుసు ద్వారా భూముల కొలతలు వేస్తే నలుగురు వ్యక్తులు, సహాయకులుగా మరొకరు వ్యవహరించాల్సి ఉంటుంది. వీరందరిని రైతే సమకూర్చుకోవాలి. దీనికి స్వస్తి పలికి ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) మిషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరింత స్పష్టతకు డీజీపీఎస్ పరికరం వినియోగిస్తున్నారు. అయితే సర్వే త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరికి రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వేలాండ్ రికార్డుశాఖ ఏడీ కిషన్‌రావు వివరించారు.


