కరీంనగర్ కార్పొరేషన్: ఫోన్ వాడినా...ల్యాప్ టాప్ వాడినా రాజీవ్ గాంధీ గుర్తుకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధా ని రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లనే సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవం సాధ్యపడిందన్నారు. నగరంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్ల 20ఏళ్ల ముందే దేశంలోకి కంప్యూటర్ వచ్చిందన్నారు. ఆయన నాటిన బీజాలతోనే 15ఏళ్ల ముందే సెల్‌ఫోన్‌లు వచ్చాయని తెలిపారు. రాజీవ్ గాంధీని కలిసే మహాభాగ్యం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తమకు కలిగాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జెన్‌జీకి గుర్తింపు ఇచ్చింది రాజీవ్ గాంధీయేనన్నారు. రేవంత్, మహేశ్‌గౌడ్ జోడెద్దుల మాదిరిగా మళ్లీ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తారన్నారు. అనంతరం మొదటగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కటకం మృత్యుంజయం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మంద నగేశ్‌ను సన్మానించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, వొడితెల ప్రణవ్, ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు.
ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్ష్ ప్రారంభం
సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించిన ఐడీఎస్‌ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. సుడా నిధులు రూ.1.28 కోట్లతో నిర్మించనున్న నైట్‌ఫుడ్ కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


