గజం రూ.63,000.. అడుగు రూ.4,000 | - | Sakshi
Sakshi News home page

గజం రూ.63,000.. అడుగు రూ.4,000

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

50 నుంచి 100శాతం వరకు పెరిగిన భూమి మార్కెట్‌ ధరలు

నగర పరిధిలో గజానికి రూ.2,600 నుంచి రూ.63 వేల వరకు పెంపు

శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలు

కరీంనగర్‌క్రైం: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను భారీగా సవరించడంతో ఆస్తుల కొనుగోలు, విక్రయించేవారిపై అదనపు భారం పడనుంది. శుక్రవారం నుంచి కొత్త మార్కెట్‌ ధరలు అమల్లోకి రాగా.. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూముల విలువను 50శాతం నుంచి 100శాతం వరకు పెంచగా, కీలక ప్రాంతాల్లో రెట్టింపు పెరగడం గమనార్హం. నగరంలోని టవర్‌ సర్కిల్‌ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజానికి గరిష్టంగా రూ.31,500 ఉండగా రూ.63,000 వరకు పెంచారు. మెయిన్‌ సెంటర్లయిన ప్రకాశం గంజ్‌, మదీనా కంప్లెక్‌, జాఫ్రీ రోడ్డు, రాజీవ్‌చౌక్‌తో పాటు మెయిన్‌ రోడ్డు పక్కనున్న ప్రాంతాల్లో ధరలు డబు ల్‌ చేసేశారు. అపార్టుమెంట్లకు రూ.4000 వరకు పెంచారు. కార్పొరేషన్‌లో విలీనమైన వల్లంపహాడ్‌లో గజానికి అతి తక్కువగా రూ.2,600 కాగా.. దుర్శేడ్‌లో గజానికి రూ.3,700గా నిర్ణయించారు. దుర్శేడ్‌, బొమ్మకల్‌, ఆరెపల్లి, వల్లంపహాడ్‌ వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ విలువను గజానికి రూ.1,800గా నిర్ణయించారు. కరీంనగర్‌–జగిత్యాల, కరీంనగర్‌–మంచిర్యాల, కరీంనగర్‌– హైదరాబాద్‌ వంటి ప్రధాన రహదారుల వెంట ఉన్న భూములకు భారీగా విలువలు పెంచారు.

కొనుగోలుదారులపై అదనపు భారం

భూముల మార్కెట్‌ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలు పెరగనున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పదని రియల్‌ఎస్టేట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ముందుగానే తెలిసిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని భావించిన కొనుగోలుదారులు, విక్రేతలు కార్యాలయాలకు తరలివచ్చారు. దీంతో అనేక చోట్ల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నా.. శుక్రవారం జరిగిన రిజిస్ట్రేషన్లకు అదనపు ఫీజు చెల్లించారు. కాగా.. కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 44 రిజిస్ట్రేషన్లు జరిగితే, 5వ తేదీన మార్కెట్‌ ధరలు పెరిగిన తర్వాత 24 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement