బల్దియాలో కమలం గెలుపు లాంఛనమే అభ్యర్థులను ప్రకటించిన బండి సంజయ్ నేడు నగరపాలకసంస్థ కో ఆప్షన్ ఎన్నిక ఎన్నికకు కాంగ్రెస్ కార్పొరేటర్లు దూరం అధికారుల తీరుపై విపక్షాల ఆగ్రహం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు స్థానాలకు శనివారం ఉదయం 11గంటలకు నగరపాలకసంస్థ కౌన్సిల్ హాల్‌లో ఎన్నిక నిర్వహించనున్నారు. అధికార బీజేపీకి పూర్తి బలం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉంటామని చెబుతుండగా, బీఆర్‌ఎస్ పోటీదారులు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థులు ఐదుగురు గెలవడం లాంఛనమే అయింది. అభ్యర్థుల పేర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం వెల్లడించారు.
నేడు కో ఆప్షన్ ఎన్నిక
నగరపాలకసంస్థ కో ఆప్షన్ సభ్యులను శనివారం ఉ దయం 11 గంటలకు కౌన్సిల్ హాల్‌లో నిర్వహించే సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో ఎన్నుకోనున్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఐదుగురు సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే, ముందు కోరంకు అవసరమైన 35 మంది సభ్యులు ఉన్నారా లేరా అని చూస్తారు. కో రం లేకపోతే వాయిదా వేస్తారు. పోటీచేస్తున్న అభ్యర్థుల పేర్లను కేటగిరీ వారీగా చదివి వినిపిస్తారు. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కో సభ్యుడు ఐదుగురికి చేతులెత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు ప్రకటిస్తారు. 66 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యుల హోదాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు కో ఆప్షన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది.
పోటీలో 40 మంది
ఐదు కో ఆప్షన్ స్థానాలకు 40 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 46 మంది దరఖాస్తు చేసుకోగా, ఐదుగురు రిజెక్ట్ అయ్యారు. ఒకరు ముందుగానే విరమించుకొన్నారు. ఐదుస్థానాల్లో మూడు జనరల్, రెండు మైనార్టీ కోటాలో ఉన్నా యి. జనరల్, మైనార్టీల్లో ఒక్కోటి మహిళకు రిజర్వ్ చేశారు. మూడు జనరల్ స్థానాలకు 27 మంది, రెండు మైనార్టీ స్థానాలకు 13 మంది పోటీలో ఉన్నారు. జాబితా రూపొందించిన తరువాత విరమించుకుంటున్నట్లు బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు దరఖాస్తు చేసుకున్నా సాంకేతికంగా పోటీలోనే ఉన్నారు.
బీజేపీ అభ్యర్థులు వీళ్లే...
– పరిచయం చేసిన బండి సంజయ్
కో ఆప్షన్ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్పొరేటర్లకు పరిచయం చేశారు. నగరంలోని ఓ హోటల్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి కార్పొరేటర్లు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కన్న కృష్ణ, నందకుమార్, చిగిరి వెంకటమ్మ, హఫీజా బేగం, బల్బీర్‌సింగ్‌లను బీజేపీ కో ఆప్షన్ అభ్యర్థులుగా పరిచయం చేశారు. అభ్యర్థులను కలిసికట్టుగా గెలిపించాలని కార్పొరేటర్లకు సూచించారు.
కాంగ్రెస్ దూరం.. బీఆర్‌ఎస్ హాజరు?
కో ఆప్షన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. 18 మంది కార్పొరేటర్ల బలం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌తో కలిసే ఉద్దేశం లేక, పోటీచేసేందుకు తమ పార్టీ నాయకులు ఎవరు ముందుకురాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. శనివారం నాటి ఎన్నికకు దూరంగా ఉండనుంది. ఇక బీఆర్‌ఎస్ నుంచి పలువురు దరఖాస్తు చేసుకొన్నప్పటికి, ఇందులో కొంతమంది పోటీనుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. పదిమంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.
ఎన్నికల తీరుపై విపక్షాల ఆగ్రహం
కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియలో గోప్యతను పాటించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికకు ఒక్కరోజు ముందు వరకు పోటీదారుల జాబితాను కార్పొరేటర్లకు ఇవ్వకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. ఎవరు, ఏ కేటగిరీలో పోటీచేస్తున్నారో తెలియకుండా, ఎన్నికల్లో పాల్గొనడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. జనరల్‌బాడీలో ప్రాతినిథ్యం లేని మైనార్టీలను ఎన్నుకోవాలని నిబంధన ఉన్నప్పటికి, ప్రాతినిథ్యం ఉన్న వాళ్లనే ఎన్నుకోవడమేమిటంటున్నారు. జనరరల్‌బాడీలో ప్రస్తుతం ముస్లింలు, సిక్కులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆ కేటగిరీలు కాకుండా క్రిస్టియన్, పార్శీ, బుద్దుల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.


