బోయినపల్లి(చొప్పదండి): వరిపంటలు పొట్ట దశలో ఉండి ఈనే సమయంలో ఎల్లంపల్లి నీరు వరదకాలువకు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి రెండో వారంలో పంటలకు ఎల్లంపల్లి నీరు అందడంతో చేలు పచ్చగా మారాయి. వరదకాలువ ఆధారంగా యాసంగి సీజన్‌లో వరి పంటలు వేసిన రైతులు మెజార్టీగా పంట కోశారు. ఇంకా కొందరు వరి కోతలకు సిద్ధంగా ఉన్నారు. వరదకాలువలోని నీటి స్టోరేజీ కెపాసిటీ 1.7 టీఎంసీలు. ప్రస్తుతం వరదకాలువలో సుమారు ఐదు మీటర్ల మేర నీరు ఉంది.
జలయజ్ఞంలో నిర్మాణం
జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో వరదకాలువ నిర్మించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యూలేటరీ వరకు 122 కిలోమీటర్ల మేర వరదకాలువ విస్తరించి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని వరదకాలువ పరిసరాల్లో ఉన్న రైతులకు ఈ నీరు పంటలకు జీవం పోస్తుంది. ఏటా వానాకాలం సీజన్‌లో వరదకాలువ నీటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 70 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందులో జగిత్యాల జిల్లాలో వరదకాలువ ఆధారంగా అత్యధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు వరి పంట వేస్తారు.
వరి పంటలను ఆదుకున్న ఎల్లంపల్లి నీరు
ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరదకాలువ ఆధారంగా చాలా మంది రైతులు వరి సాగుచేశారు. కాగా వరి పంటలు ఈనే సమయంలో నీటి కొరత ఏర్పడింది. ఈక్రమంలో ఎల్లంపల్లి నీరును వరదకాలువకు విడుదల చేయాలని రైతులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విన్నవించారు. ఎమ్మెల్యే సత్యం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వరదకాలువకు నీరు విడుదల చేయించి పంటలను కాపాడారు. ఐదు డివిజన్లు ఏర్పాటు చేశారు. ఐదు డివజన్ల పరిధిలో ఐదుగురు ఈఈలు, ఇద్దరు ఎస్‌ఈలు పర్యవేక్షిస్తారు.
జీవనదిలా..
వరదకాలువలో నిల్వ ఉండే నీరు సుమారు 18 మీటర్ల లోతు ఉంటుంది. ఈనీటితో నిజామాబాద్ జిల్లాతో పాటు, ఉమ్మడి కరీంనగర్‌లో ఉన్న జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలోని మండలాల్లో రైతులు వానాకాలం సీజన్‌లో సుమారు లక్ష ఎకరాల మేర వరి సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్, కోరుట్ల, మేడిపెల్లి, మల్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో, కరీంనగర్ జిల్లా పరిధిలోని గంగాధర, రామడుగు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఐదు వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వరదకాలువ నీటితో జగిత్యాల జిల్లాలో ఎక్కువగా వరి సాగు అవుతోంది. రైతులు వరదకాలువకు ఇరువైపులా మోటార్లు అమర్చుకుని వ్యవసాయ భూములకు పైపులైన్ల ద్వారా నీరు అందిస్తూ సేధ్యం చేస్తున్నారు.
ఎల్లంపల్లి నీరు చేరికతో జలసిరి
ఎండాకాలంలో సైతం వరదకాలువలో నీరు
గత వానాకాలం, యాసంగి పంటలకు నీరు
ఎస్సారెస్పీ నుంచి 122 కి.మీ. మేర వరదకాలువ
వరదకాలువ స్వరూపం
పొడవు : 122 కిలోమీటర్లు
విస్తరించి ఉన్న జిల్లాలు: నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల
డివిజన్లు: 05
స్టోరేజీ కెపాసిటీ : 1.7 టీఎంసీ
ప్రస్తుతం ఉన్న నీరు : సుమారు ఐదు మీటర్లు


