జ్యోతినగర్: ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్ కిరణ్ కథనం ప్రకారం.. మాణిక్‌రావు సతీశ్(40) ఎన్టీపీసీ ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 22న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. సతీశ్ భార్య నిర్మల శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనుమతులు లేకుండా తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన సంపంగి బాబు అనే వ్యక్తి అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమతుల సమయం దాటిన తర్వాత ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


