సిరిసిల్లటౌన్: మధ్య వయస్కులు, రెగ్యులర్‌గా చదువు ఆపేసిన వారి ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్టడీ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఓపెన్‌స్కూల్, ఇంటర్ విద్య అక్రమార్కులకు నెలవుగా మారింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుకు మించి అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడటం వివాదానికి దారితీసింది. అభ్యర్థులకు తరగతుల నిర్వహణ మాట అటుంచి కనీసం స్టడీ మెటీరియల్ లేకుండానే పరీక్షలు రాయించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్న వైనమిది.
10 స్టడీ కేంద్రాలు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 స్టడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఓపెన్ టెన్త్‌లో 348, ఇంటర్మీడియట్‌లో 999 మంది అభ్యర్థులు చేరారు. వీరు ఆన్‌లైన్ telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సెస్సీ అభ్యర్థులు రూ.150 రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.1400 అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, ట్రాన్స్‌జెండర్స్, మహిళలకు అడ్మిషన్ ఫీజులో రూ.400 మినహాయింపు ఉంటుంది. ఇంటర్మీడియట్‌కు జనరల్ అభ్యర్థులు రూ.300 రిజిస్ట్రేషన్, రూ.1500 అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ఎంచుకున్న స్టడీసెంటర్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు, ఇతర రషీదులు అందించాలి. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు సెంటర్ నిర్వాహకులు ఉచితంగా స్టడీ మెటీరియల్‌తోపాటు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించాలి.
ఒక్కొక్కరి నుంచి రూ.1000 వసూలు !
అభ్యర్థుల నుంచి స్టడీమెటీరియల్ పేరుతో స్టడీ సెంటర్ల నిర్వాహకులు రూ.వెయ్యి చొప్పున అధికంగా వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు నిర్వాహకులైతే ఏకంగా అభ్యర్థుల నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా వసూలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి కోర్సు అభ్యసనకు సొసైటీ నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. అలా కాదని కొందరు నిర్వాహకులు అభ్యర్థుల నుంచి రూ.వేయి అధికంగా ముక్కుపిండి వసూలు చేశారు. అయితే అధికంగా వసూలు చేసిన వారు అభ్యర్థులకు కనీసం స్టడీ మెటీరియల్ అందించకపోవడం వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలో ఈనెల 20 నుంచి 27 వరకు ఓపెన్ విద్య పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అభ్యర్థులకు స్టడీమెటీరియల్ అందివ్వకపోవడంతో పరీక్షలు సరిగ్గా రాయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం.
మాల్‌ప్రాక్టీస్‌కు డీఈవో చెక్
ఓపెన్ విద్య పరీక్షలు అంటే గతంలో మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉంటుందన్న పేరుంది. అయితే ఈఏడాది జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే పరీక్ష కేంద్రాల ఇన్‌చార్జీలు, ఇన్విజిలేటర్ల నియామకంలో మార్పులు చేశారు. దీంతో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందక చదవలేకపోవడంతోపాటు మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. పరీక్షల్లో పాసయ్యేందుకు ఒకే సిట్టింగ్‌లో పాస్ గ్యారెంటీ పేరుతో కొందరు మధ్యవర్తులు అక్రమాలకు తెరలేపుతూ.. పలువురి నుంచి అదనపు వసూళ్లకు పాల్పడ్డట్లు చర్చ సాగుతోంది. అయితే డీఈవో మాల్‌ప్రాక్టీస్ జరక్కుండా చర్యలు తీసుకోవడం వారికి మింగుడు పడక తీసుకున్న డబ్బులను అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిబంధనలు ఉల్లంఘించి స్టడీ సెంటర్ల నిర్వాహకులు స్డటీమెటీరియల్ ఇవ్వకుండా అభ్యర్థులను పరీక్షలకు పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో సుమారు 1,400 మంది అభ్యర్థులుండగా వారి నుంచి రూ.లక్షల్లో అ ధికంగా వసూలు చేయడం చర్చనీయాంశమైంది.
ముక్కుపిండి వసూలు చేసిన అక్రమార్కులు
ఒక్కొక్కరి నుంచి అదనంగా రూ.వెయ్యి
ఆన్‌లైన్‌లో ఫీజులు.. ఆఫ్‌లైన్‌లో అధిక వసూళ్లు
జిల్లా ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్‌లో అవినీతి వ్యవహారం
ఓపెన్ పరీక్షల్లో పారదర్శక విధానం
ఓపెన్ విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నాం. మాల్‌ప్రాక్టీస్‌కు ఎలాంటి తావులేదు. స్టడీమెటీరియల్‌కు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణీత రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైనా అధికంగా ఫీజు వసూలు చేసినట్లు అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– జగన్మోహన్‌రెడ్డి, డీఈవో


