ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తాం

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

● ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి ● డీజీపీ శివధర్‌రెడ్డి ● రుద్రంగిలో నూతన పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

● ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి ● డీజీపీ శివధర్‌రెడ్డి ● రుద్రంగిలో నూతన పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

రుద్రంగి(వేములవాడ): రాష్ట్రంలో సిటీజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తామని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. రుద్రంగిలో రూ.2.50కోట్లతో నిర్మించే ఆధునిక పోలీస్‌స్టేషన్‌ భవన పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల కేంద్రంగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటుబెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాలతోనే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల సేవలు ఎంతో కీలకం

ప్రజల రక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి అని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అరైవ్‌.. అలైవ్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. వేములవాడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ కేటాయించాలని, భీమారంలో కొత్తగా పోలీస్‌స్టేషన్‌ మంజూరు చేయాలని, వేములవాడ ఆలయ భద్రత సిబ్బంది సంఖ్యను పెంచాలని డీజీపీని కోరారు.

నూతన పోలీస్‌స్టేషన్‌ ఎంతో కీలకం

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రజలకు భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు నూతన పోలీస్‌స్టేషన్‌ ఎంతో అవసరమన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ, అధికార యంత్రాంగంతో కలిసి ఇటీవల జిల్లాలో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు, మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. అరైవ్‌.. అలైవ్‌లో భాగంగా జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించామన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇటీవల జిల్లాలో నో హెల్మెట్‌.. నో ఎంట్రీ అమలు చేస్తున్నామని తెలిపారు.

నేరాల నియంత్రణకు..

రుద్రంగి మండలం చిన్నదని, రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రైమ్‌ రేట్‌ తక్కువగా ఉందని ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. మండల ప్రజల సహకారంతో మండల కేంద్రంలో నేరాల నియంత్రణకు ఇటీవల హై క్వాలిటీ నంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మితమయ్యే ఈ పోలీస్‌స్టేషన్‌ ద్వారా మండల ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయన్నారు. రాష్ట్ర కో ఆపరేటీవ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాధాభాయ్‌, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్లు పుష్పలత, జయంత్‌కుమార్‌, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ లక్ష్మీనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి పాల్గొన్నారు.

భీమన్న ఆలయంలో పూజలు

వేములవాడ: భీమేశ్వరస్వామి వారిని డీజీపీ శివధర్‌రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయంలో అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఆలయ డీఈవో భాస్కరశర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement