చేతులెత్తేశారు! | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు!

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

కో ఆప్షన్‌పై బీఆర్‌ఎస్‌ మాజీల వెనుకడుగు పోటీపై గులాబీ పార్టీలో మల్లగుల్లాలు ఇప్పటికే ఎన్నికకు దూరంగా కాంగ్రెస్‌ అధికార బీజేపీకే కో ‘ఆప్షన్‌’ ఐదు స్థానాలకు 40 మంది పోటీ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కో ఆప్షన్‌ ఎన్నికలపై బీజేపీయేతర పార్టీలు దాదాపు చేతులెత్తేశాయి. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక జరగనుండడం, రహస్య ఓటింగ్‌ లేకపోవడం, ఇప్పటికే ఎన్నికకు దూరమంటూ కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పోటీ చేయాలా వద్దా అనే అంశంపై శుక్రవారం అధికారికంగా వెల్లడించనున్నట్లు చెబుతున్నారు. ఐదుస్థానాలు కై వసం చేసుకోవడంపై బీజేపీ పూర్తిస్థాయిలో ధీమాగా ఉంది. ఐదుస్థానాలకు 40 మంది పోటీలో ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ మాజీలు విత్‌డ్రా

బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు పలువురు కో ఆప్షన్‌ పోటీనుంచి తప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు గందె మాధవి, బోనాల శ్రీకాంత్‌, జంగిలి ఐలేందర్‌ యాదవ్‌, జంగిలి సాగర్‌ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు నగరపాలకసంస్థ అధికారులకు గురువారం దరఖాస్తు చేశారు. వాటిని ఆమోదించే పరిస్థితి లేదని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికల తరహాలో కో ఆప్షన్‌ ఎన్నికల్లో నామినేషన్లు, ఉపసంహరణ ఉండదు. ఓటింగ్‌కు పోటీదారుల జాబితా రూపొందించే నాటికి తాము పోటీలో ఉండమని మరోసారి దరఖాస్తు చేస్తే వారి పేర్లను తప్పిస్తారు. 25వ తేదీన ఎన్నిక జరగనుండగా, ఇప్పటికే జాబితాను రూపొందించారు. పోటీనుంచి విరమించుకుంటున్నట్లు గురువారం దరఖాస్తు ఇచ్చినా, ఇప్పటికే జాబితా తయారైనందున సాంకేతికంగా వారిని పోటీదారులుగానే పరిగణిస్తామని డీసీపీ బషీర్‌ తెలిపారు.

సమన్వయ లోపంతో కాంగ్రెస్‌ దూరం

పార్టీలో కొరవడిన సమన్వయం, పోటీకి పార్టీ నాయకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం తదితర కారణంగా కాంగ్రెస్‌ ఎన్నికలకు దూరంగా ఉంది. పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై చర్చించేందుకు కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ ఓ వైపు కార్పొరేటర్లు, నాయకులతో చర్చిస్తుండగానే, పార్టీ నేత ఒకరు ఇదే బాధ్యతను మరో కార్పొరేటర్‌పై పెట్టడం గందరగోళానికి గురిచేశాయి. ఇటీవల మేయర్‌ ఎన్నికలో కాంగ్రెస్‌కు చేయి ఇచ్చి బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్షంగా మద్దతు పలికిన క్రమంలో తాము బీఆర్‌ఎస్‌తో కలిస్తే తప్పుడు సంకేతాలు పోతాయనే భావనను కార్పొరేటర్లు వ్యక్తం చేశారు. వీటిన్నిటి దృష్ట్యా ఎన్నికల్లోనే పాల్గొనరాదని నిర్ణయించారు.

బీజేపీ ఖాతాలోకే...

నగరపాలకసంస్థలో సంపూర్ణ మెజార్టీ ఉన్న అధికార బీజేపీ ఖాతాలోకే ఐదు కో ఆప్షన్‌ పదవులు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం 69 ఓట్లలో గెలవడానికి అవసరమైన 35 ఓట్ల బలం బీజేపీకి ఉండగా, ప్రతిపక్షాల్లో అనైక్యత ఆ పార్టీకి ఈ ఎన్నికల్లోనూ కలిసొస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎక్స్‌అఫిషియో ఓటు అవసరం లేకుండానే కై వసం చేసుకొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

పోటీలో 40 మంది...

ఐదు కో ఆప్షన్‌ పదవులకు గాను 40 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 46 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రూటినిలో పోటీకి అర్హత లేని నలుగురు మాజీ ఎంపీటీసీలు, ఒక ఎన్‌జీవో దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఒకరు ముందుగానే దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. దీంతో 40 మంది పోటీదారులతో జాబితాను సిద్ధం చేశారు. 25వ తేదీన జరిగే ఎన్నికల్లో 40 మంది పేర్లను అధికారులు చదివి వినిపిస్తారు. అందులో నుంచి ఐదుగురిని ఎన్నుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement