అరకొరగానే కొనుగోలు కేంద్రాల ప్రారంభం అకాల వర్షంతో అన్నదాత హైరానా రెండ్రోజులు వర్షాలేనంటూ వాతావరణశాఖ ప్రకటన
కరీంనగర్ అర్బన్: పంట చేతికందే సమయాన అన్నదాతకు చినుకు చింత నెలకొంది. గురువారం జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లలో పలు చోట్ల వర్షం కురియగా రెండ్రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతుండగా, చేతికందివచ్చిన పంట కొంత కల్లాల్లో, కొంత చేలలోనే ఉండటంతో అరిగోస పడుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, శంకరపట్నం, గన్నేరువరం, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, శంకరపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురియగా చేతికందివచ్చిన వరి కోసేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.
కమ్ముకున్న మేఘాలు
జిల్లాలో ఎక్కువశాతం వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలు వేశారు. హుజూరాబాద్, సైదాపూర్, వీణవంక, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ప్రకటనలు గుప్పిస్తుండగా ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో యాసంగిసాగు విీస్తీర్ణం 3.01లక్షల ఎకరాలు కాగా 2.75లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగైంది. ఇందులో దొడ్డురకాలే సింహభాగం ఉండగా కోతల దశకు చేరుకున్నాయి. 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించగా ఇప్పటివరకు వరకు కొనుగోలు కేంద్రాలు మొదలవలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1.50లక్షల ఎకరాలకు పైగా వరి పంట చేలలోనే ఉండగా కోత దశకు చేరింది. ఈ సమయంలో మేఘావృతం కావడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
దోచుకుంటున్న హార్వెస్టర్ యజమానులు
హర్వెస్టర్ యజమానులు రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు. కమ్ముకున్న మేఘాల క్రమంలో రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు వంద వరకు హార్వెస్టర్లుండగా ఇతర జిల్లాల నుంచి లీజుపై మరో వంద వరకు కోతలు కోస్తున్నాయి. గతంలో గంటకు రూ.1600 తీసుకోగా ప్రస్తుతం రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. ఎకరా కోతకు రెండు గంటలు పడుతుండగా జిల్లా రైతులపై రూ.కోట్ల భారం పడుతోంది. ఇక దిగబడే పొలాల్లో కోసేందుకు గంటకు రూ.2400 నుంచి రూ.2600 వరకు వసూలు చేస్తున్నారు.


