కరీంనగర్‌టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగింది. గురువారం అద్దెబస్సులతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్‌తో పాటు గోదా వరిఖని, నిజామాబాద్, మంచిర్యాల, వరంగల్ వంటి ప్రధాన రూట్లలో నడిపారు. బస్సుల బంద్‌తో కరీంనగర్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడ్డారు. ప్రైవేటు వాహనాల యజమానులు అందినకాడికి దోచుకుంటున్నారు. పోలీసుల భద్రత నడుమ కొన్ని బస్సులు నడిచాయి. ఆర్టీసీ కార్మికులు ఉదయం 10 గంటలకే వన్‌డిపో గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీలు మద్దతుగా నిలిచాయి. నేటి నుంచి జేఏసీ కార్యాచరణ ప్రకటించారు. 24న డిపోల ఎదుట మౌన ప్రదర్శన, 25న వంటావార్పు, 26న కార్మిక కవాతు, 27న ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వినతిపత్రాల సమర్పణ, 28న మహిళా ఉద్యోగులతో నిరసన, 29న అర్ధనగ్న ప్రదర్శనలు చేయాలని జేఏసీ నిర్ణయించింది. కాగా.. రీజియన్ పరిధిలోని 11 డిపోల ద్వారా రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ఆదా యం వచ్చేది. సమ్మె కారణంగా ఆదాయం రూ.15 లక్షలు దాటడం లేదని ఓ అధికారి వెల్లడించారు.


