తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే సరెండర్ చేస్తా
కరీంనగర్ కార్పొరేషన్: తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సరెండర్ చేస్తానని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను హెచ్చరించారు. నగరంలోని కోర్టు రిజర్వాయర్‌లో హైలెవెల్ జోన్ పరిధి నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. హైలెవెల్ పరిధిలో తరచూ తాగునీటి సమస్యలు తలెత్తుతుండడం, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి సరఫరా సమయంలో ఈఈ, డీఈ, ఏఈ, లైన్‌మెన్, ఫిట్టర్ ఫీల్డ్‌లో ఉండి పర్యవేక్షించాలన్నారు. సరైన ప్రెషర్‌తో నీరు సరఫరా అవుతుందా, లేదా గమనించి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చి నా పరిష్కరించాలన్నారు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలన్నారు. ప్రజలతో దురుసుగా మాట్లాడినట్లు తమ దృష్టికి వస్తే, చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. కోర్టు నుంచి సుభాష్‌నగర్ వరకు కొత్త పైప్‌లైన్ పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నీటి సరఫరాలో 60 మందిని కొత్తగా తాత్కాలిక కార్మికులను తీసుకోవడం జరిగిందన్నారు. కార్మికుల సహకారంతో నగరవ్యాప్తంగా ఎక్కడా లీకేజీలు ఉన్నా గుర్తించి మరమ్మతు చేయాలన్నారు.
అధికారులు, సిబ్బందిపై చర్య తీసుకోవాలి
‘లైన్‌మెన్లు, ఫిట్టర్లు ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తూ పర్యవేక్షణ మరిచారు. చాలా చోట్ల పైప్‌లైన్లు, వాల్వ్‌లు సరిగా లేక నల్లా నీళ్లు రావడం లేదు. తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి’ అంటూ కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు వైద్యుల అంజన్‌కుమార్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారి ప్రసాద్, ఎన్నం లక్ష్మి ప్రకాశ్, బోయినపల్లి ప్రవీణ్‌రావు, బండ రమణారెడ్డి, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.


