జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మార్క్‌ఫెడ్ అధికారులు నామమాత్రంగా ప్రారంభించారు. కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడి ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలోని 10 కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 82,314 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు.
వానాకాలం మక్కలు గోదాముల్లోనే.
వానాకాలం సీజన్‌లో 13కేంద్రాల ద్వారా 2.73 లక్షల క్వింటాళ్ల మక్కలను మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోలు చేసింది. వాటిని మెట్‌పల్లి, మల్లాపూర్, రాయికల్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, గొల్లపల్లి, జగిత్యాలలోని చల్‌గల్ గోదాంలను అద్దెకు తీసుకుని అందులో నిల్వ చేసింది. సాధారణంగా, నిల్వ చేసిన మక్కలను మార్క్‌ఫెడ్ సంస్థ సీజన్ పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయిలో వేలం వేస్తుంది. కానీ.. నెలలు గడిచినా వేలం వేయకపోవడంతో గోదాముల్లో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్ సంస్థకు ప్రస్తుత సీజన్‌కు గోదాంలు దొరకని పరిస్థితి ఏర్పడింది. పైగా గోదాంలకు భారీ స్థాయిలో అద్దె చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పెద్దపల్లి జిల్లాకు మక్కలు
జగిత్యాల జిల్లాలో 6నుంచి7 లక్షల క్వింటాళ్ల మక్కలు ఉత్పత్తి అయినప్పటికీ మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించలేదు. దీంతో దాదాపు 70 శాతం మంది రైతులు పౌల్ట్రీఫాంకు, దళారులకు అమ్ముకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 80వేల క్వింటాళ్లే కొనుగోలు చేయగా.. ఇంకా లక్ష క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉందని మార్క్‌ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు కొన్న మక్కలను జిల్లాలోనే నిల్వ చేసారు. కేంద్రాలకు ఎక్కువగా మక్కలు వస్తుండటంతో 20వేల క్వింటాళ్ల మక్కలను పెద్దపల్లి జిల్లాలోని గోదాంలకు తరలించారు. ఇంకా కొనే మక్కలను కూడా పెద్దపల్లికే తరలించేందుకు అక్కడి గోదాంలను అద్దెకు తీసుకుంటున్నారు.
మొక్కుబడిగా కొనుగోలు
మక్క పంట చేతికొచ్చి నెల కావస్తున్నా.. కొనుగోలులో తాత్సారం చేయడంతో రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించారు. రైతుల ఒత్తిడితో జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మొక్కుబడిగా కొంటున్నారు. జగిత్యాలలో 16,187 క్వింటాళ్లు, ఇబ్రహీంపట్నంలో 16,071క్వింటాళ్లు, మెట్‌పల్లిలో 15,233 క్వింటాళ్లు, రాయికల్‌లో 12,431 క్వింటాళ్లు, కోరుట్లలో 10,224 క్వింటాళ్లు, కథలాపూర్‌లో 6,867 క్వింటాళ్లు, మల్లాపూర్‌లో 2,625 క్వింటాళ్లు, మేడిపల్లిలో 1591 క్వింటాళ్లు, లక్ష్మీపూర్‌లో 825 క్వింటాళ్లు, ధర్మపురిలో 258 క్వింటాళ్లు కొన్నారు.
యాసంగి సీజన్ కోసం గోదాముల వెతుకులాట
10 కొనుగోలు కేంద్రాల ద్వారా 82,314 క్వింటాళ్ల కొనుగోలు
ఇంకా కేంద్రాలకు లక్ష క్వింటాళ్లు వచ్చే అవకాశం
పెద్దపల్లి జిల్లా గోదాంలకు తరలిస్తున్న మక్కలు


