వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన జక్కుల సరిత కుటుంబం. దివ్యాంగుడైన తన భర్త లింబాద్రితో కలిసి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ త్రీవీలర్ స్కూటీపైన కూరగాలయలు అమ్ముకుంటూ వారి ముగ్గురు అడపిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో క్షణికావేశం నిప్పులు పోసింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద సంసారంలో గొడవలు ముగ్గురు పసిప్రాణాలను అనాథలను చేశాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి పురుగుల మందు తాగి తనువు చాలించాడు. అప్పటి వరకు ఎంతో ఆప్యాయంగా బతికిన వారు తండ్రి దూరం కావడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పెద్ద దిక్కుగా ఉన్న లింబాద్రి మరణంతో భార్య సరిత కుప్పకూలిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ముగ్గురు పిల్లలను ఎలా సాదుకోవాలనేది అర్థం కావడం లేదు. పిల్లల చదువులు, తిండి, ఇతర అవసరాలు తీర్చడం సరితకు తలకుమించిన భారంగా మారింది.
వీర్నపల్లి(సిరిసిల్ల): ‘అమ్మా.. ఆకలేస్తోంది అన్నం పెట్టవా?’ అని అడిగే లోపే అమ్మ లేదు.. ‘నాన్నా.. బడికి ఫీజు కట్టాలి’ అని అడిగే లోపే నాన్న లేరు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు చిన్నారుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి మనస్పర్థలు చివరికి ఆత్మహత్యలకు దారితీస్తుండడంతో వారి చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. అమ్మానాన్న ఉన్న రోజుల్లో తమ భవిష్యత్‌పై భరోసాగా బతికిన పిల్లలు తల్లిదండ్రుల మరణం తర్వాత అంతా శూన్యంగా గడుపుతున్నారు. కన్నవారు తమ ప్రాణాలు తీసుకుంటుంటే.. ఆ చిన్నారుల ఆలనా పాలనా చూసే వారు కరువవుతున్నారు.
కుటుంబాలు వీధిపాలు
ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యక్తిగత గొడవలు కావచ్చు.. సమస్య ఏదైనా పరిష్కరించుకోవాలే తప్ప ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదనే ఆలోచన రాక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా అనాలోచిత నిర్ణయాలతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా అమ్మ ప్రేమకు, నాన్న నీడకు దూరమైన పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా తోటి పిల్లలను చూసి వారు పడే వేదనకు అంతులేకుండా పోతోంది.
క్షణికావేశంతో మమ్మల్ని అనాథలను చేయకండి
వేడుకుంటున్న చిన్నారులు
పెద్దల ఆత్మహత్యలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు
అంధకారమవుతున్న భవిష్యత్


