చెల్లిని తీసుకెళ్లడానికి వచ్చి.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

చెల్లిని తీసుకెళ్లడానికి వచ్చి.. అనంతలోకాలకు..

Apr 24 2026 6:02 AM | Updated on Apr 24 2026 6:02 AM

ఆటో బోల్తా పడి మహిళ మృతి

ముగ్గురికి గాయాలు

పర్లపల్లిలో ఘటన

మొగుళ్లపల్లి: పాఠశాలకు సెలవులు రావడంతో చెల్లిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చి అక్క తిరుగు ప్రయాణంలో అనంతలోకాలకు చేరింది. ఆటో బోల్తాపడిన ఘటనలో మృతి చెందింది. ఈ ఘటన గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక (25) తన భర్త అనిల్‌, అక్క ముదురుకోళ్ల స్వప్నతో కలిసి ఆటోలో మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తమ చెల్లి సాత్వికను తీసుకెళ్లడానికి పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం నలుగు రు కలిసి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో పర్లపల్లి శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సాన్విక అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యా యి. దీంతో క్షతగాత్రులను 108లో హుజూ రాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

ధర్మపురి: గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన అట్టపెల్లి రాజేంద్రప్రసాద్‌ ఈనెల 18న ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన స్నేహితుడైన తరుగుల సంపత్‌ను కలవడానికి వెళ్లాడు. వాహనంలో తిరిగి వస్తూ.. గుడిహత్నూర్‌ వద్ద దిగిపోయాడు. గురువారం రాయపట్నం వంతెన వద్ద శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు అట్టపెల్లి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రాజేంద్రప్రసాద్‌ది ఆత్మహత్యనా.. లేక హత్యచేసి పడేశారా..? తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

చెరువులో పడి వృద్ధురాలి మృతి

బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రొమాల మల్లవ్వ(70) మానసిక అనారోగ్యంతో బాధపడుతూ చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. మల్లవ్వ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో ఈనెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగింటికి రాలేదు. తన తల్లి మల్లవ్వ కనిపించడం లేదని ఆమె కుమారుడు రొమాల శరవాండు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా గురువారం గ్రామంలోని చెరువు వద్ద మృతదేహం కనిపించింది. తన తల్లి మల్లవ్వ మానసిక పరిస్థితి బాగాలేక చెరువులో పడి మరణించి ఉండవచ్చని ఆమె కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహం కుళ్లిపోవడంతో కోరెం చెరువు వద్దనే పోస్టుమార్టం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement