అందని ‘ఉపాధి’ డబ్బులు | - | Sakshi
Sakshi News home page

అందని ‘ఉపాధి’ డబ్బులు

Apr 24 2026 6:02 AM | Updated on Apr 24 2026 6:02 AM

రెండున్నర నెలలుగా నిలిచిపోయిన వైనం

ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు

నీరుగారుతున్న పథకం లక్ష్యం

మెట్‌పల్లిరూరల్‌: వలసలను నివారించి స్థానికంగానే కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. పథకం కిందట పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బుల చెల్లింపులు జరగడంలేదు. దీంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసిన పనులకు డబ్బులు రావడంలో కాలయాపన జరగుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. రెండున్నర నెలలుగా అందడం లేదు.

రూ.లక్షల్లో పెండింగ్‌

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వేసవిలోనే కాకుండా మిగతా కాలంలోనూ జోరుగానే సాగుతుంటాయి. పూడికతీత, భూముల చదును, కందకాలు తీయడం, చెరువులు, కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించడం వంటి పనులు చేపడుతుంటారు. మెట్‌పల్లి మండలంలోని 23 గ్రామాల్లో 5600 జాబ్‌ కార్డులు నమోదై ఉన్నాయి. ఇందులో పనులకు హాజరయ్యే జాబ్‌ కార్డులు 1600 వరకు మాత్రమేనని రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు చేసిన పనిదినాలకు సంబంధించిన రూ.14 లక్షలకు పైగా కూలీలు డబ్బులు రావాల్సి ఉంది. చేసిన పనులకు సంబంధించిన డబ్బులు కోసం కూలీలు ఎదురుచూపులు చూస్తున్నారు.

పక్షం రోజుల్లోనే చెల్లింపులు

పథకం నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు తప్పనిసరిగా చెల్లించాలి. ఒకవేళ జాప్యం చోటుచేసుకుంటే తగిన పరిహారం చెల్లించాలి. రెండున్నర నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సకాలంలో డబ్బులు వచ్చాయని, ఇప్పుడెందుకు జాప్యం జరుగుతోందని కూలీలు ఫీల్డ్‌అసిస్టెంట్లు, అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు త్వరగా చెల్లించేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement