● పెళ్లి కొడుకు, తల్లిదండ్రులపై కేసు నమోదు
జమ్మికుంట: ఒకరితో పెళ్లి నిశ్చయించుకుని, రూ.2లక్షల కట్నం తీసుకుని, మరొకరిని వివాహం చేసుకున్న యువకుడితో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం జమ్మికుంట పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన గండికోట కవిత, రాజేందర్ దంపతుల కొడుకు గణేశ్‌తో వివాహం నిశ్చయమైంది. రూ.11లక్షలు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. గతనెల 27న కాజీపేటలో పెద్దమనుషుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. రూ.2లక్షలు అప్పగించారు. ఇక పెళ్లి జరుగుతుందని అనుకున్న క్రమంలో గణేశ్ వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితుల ఫిర్యాదుతో గణేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ తెలిపారు.
భీమన్నకు మొక్కులు
వేములవాడ: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో భక్తులు సొంత వాహనాల్లోనే వేములవాడకు చేరుకుంటున్నారు. గురవారం భీమన్న ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు చేశారు. మధ్యాహ్నం వేళ వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వానతో భక్తులు ఇబ్బంది పడ్డారు.


