సమ్మె శాంతియుతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మె శాంతియుతంగా జరుపుకోవాలి

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

కరీంనగర్‌క్రైం: ఆర్టీసీ కార్మికులు శాంతియుత వాతావరణంలో సమ్మె నిర్వహించుకోవాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్‌ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిస్థాయిలో పోలీస్‌ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తే వెంటనే కరీంనగర్‌ పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 87126 70713కు ఫోన్‌ చేయాలని లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.

హాస్టల్‌ పరిసరాలు శుభ్రంగా ఉండాలి

కరీంనగర్‌కార్పొరేషన్‌: పరిశుభ్ర వాతావరణంతోనే విద్యార్థులకు విద్యపై శ్రద్ధ కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నగరంలోని కశ్మీర్‌గడ్డ ఎస్సీ హాస్టల్‌లో పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల గదులతో పాటు మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. హాస్టల్‌ ఆవరణలో పారిశుధ్య కార్మికులు, సిబ్బందితో కలిసి పరిశుభ్రత పనులు నిర్వహించారు. చెత్తాచెదారం, కలుపు మొక్కలు తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హాస్టల్‌ అధికారులు, సిబ్బంది హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అదనపు కమిషనర్‌ సువార్త, వెటర్నరి అధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి, ఎంహెచ్‌వో సుమన్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్లు శ్యామ్‌రాజ్‌, అనిల్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

కరీంనగర్‌టౌన్‌: ఆర్టీసీ కరీంనగర్‌–2 డిపోలో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌గా పనిచేసేందుకు ఆసక్తిగల వారు సంప్రదించాలని డిపో మేనేజర్‌ మంగళవారం పేర్కొన్నారు. డ్రైవర్‌కు హెవీ లైసెన్స్‌తో పాటు 18 నెలల అనుభవం కలిగి ఉండి ఒరిజినల్‌ లైసెన్స్‌, ఆధార్‌కార్డు, 2 ఫొటోలతో రావాలని సూచించారు. కండక్టర్‌కు ఎస్సెస్సీ (10వ తరగతి) పాస్‌ అయి ఉండాలి. ఒరిజినల్‌ మెమో, ఆధార్‌కార్డు, 2 ఫొటోలతో రావాలన్నారు. డ్రైవర్‌కు రోజుకు రూ.1,000, కండక్టర్‌కు రోజుకు రూ.800 భత్యం ఉంటుందన్నారు. వివరాలకు 70131 94357, 93986 58062, 99592 25921 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ సంబరాలు

కరీంనగర్‌టౌన్‌: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బుధవారం కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్‌ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌, నాయకులు గందె మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కాళోజీనగర్‌, గౌడ్స్‌కాలనీ, రేకుర్తి చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement