ఎలక్ట్రిక్‌ వాహనాలతో జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వాహనాలతో జాగ్రత్త!

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

జ్యోతినగర్‌: అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, వీధుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ వాహన ప్రమాదాలకు ఈవీ ప్రమాదాలకు మధ్య చాలాతేడా ఉంటుంది. లిథియం–అయాన్‌ బ్యాటరీల స్వభావాన్ని అర్థం చేసుకోవడం వాహనదారులకే కాదు.. అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రతీఒక్కరికి చాలాముఖ్యం. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మంటలు ప్రారంభమైతే శ్రీథర్మల్‌ రన్‌అవేశ్రీ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒకగొలుసుకట్టు చర్య వంటిది. ఇక్కడ ఒక బ్యాటరీ సెల్‌ మంటలు అంటుకోగానే పక్కనే ఉన్నసెల్స్‌ను సెకన్ల వ్యవధిలో వేడి చేస్తుంది. తద్వారా ఉష్ణోగ్రతలు 600 సెంటీగ్రేడ్‌ల నుంచి 1000 సెంటిగ్రేడ్‌ల వరకు చేరుకుంటుంది. ఇలాంటి మంటలను ఆర్పడానికి సాధారణ పౌడర్‌ ఆధారిత ఫైర్‌ ఎక్స్‌టింగ్యుషర్లు ఏమాత్రం పనిచేయవు.

ప్రమాదాలపై అప్రమత్తం

వాహనం నుంచి పొగ రావడం గమనించిన వెంటనే తొలిప్రాధాన్యతగా అక్కడి నుంచి పారిపోవడం మాత్రమే అయి ఉండాలి. ఫోన్‌, బ్యాగ్‌ వంటి వస్తువుల కోసం సమయం వృథా చేయకండి. కారులో ఉన్నవారు గరిష్టంగా 60 సెకన్లలోపు బయటకు వచ్చి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరం పారిపోవాలి. బ్యాటరీ కాలిపోయేటప్పుడు ‘హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌’ అనే అత్యంత భయంకరమైన విషవాయువు వెలువడుతుంది. ఇది గాలి కన్నా బరువుగా ఉండి, ఊపిరితిత్తులను, చర్మాన్ని క్షణాల్లో దెబ్బతీస్తుంది. పొగను పీల్చడం ప్రాణాంతకం. గాలి వీచే దిశకు ఎదురుగా కాకుండా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. బకెట్లతో నీళ్లు చల్లడంతో మంటలు ఆరకపోగా, ఆ నీరు విషవాయువులను నేరుగా ముఖంపైకి నెట్టే ప్రమాదం ఉంది. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలో, బేస్‌మెంట్లలో ఈవీ వాహనాలు ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది. మంటలు అంటుకున్నప్పుడు పొగ సెల్లార్‌ అంతా నిండిపోయి లిఫ్ట్‌ షాఫ్టుల ద్వారా పైఅంతస్తులకు వ్యాపిస్తుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్‌ వాడకూడదు.

ముఖ్యమైన విషయాలు

ఈవీ బ్యాటరీలు మంటలు ఆరిపోయినట్లు కనిపించినా 24 నుంచి 48 గంటల వరకు ఎప్పుడైనా మళ్లీ కాలిపోయే అవకాశం ఉంటుంది. లోపల రసాయన చర్య జరుగుతూనే ఉండటంతో ఇలా సంభవిస్తుంది. అందుకే మంటలు ఆరిపోయాయి కదా అని వాహనం దగ్గరకు వెళ్లకూడదు. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చేటప్పుడు అది ‘ఎలక్ట్రిక్‌ వాహనం’అని కచ్చితంగా చెప్పాలి, అప్పుడే వారు ఆక్సిజన్‌ మాస్కులు, ప్రత్యేక హాజ్మత్‌ రక్షణ గేర్‌తో వస్తారు.

ముందస్తు జాగ్రత్తలు

బ్యాటరీని ఎప్పుడూ 100శాతం వరకు చార్జ్‌ చేయకుండా 20 నుంచి 80శాతం మధ్య ఉంచడం శాసీ్త్రయంగా సురక్షితం. ఎండఎక్కువగా ఉన్నప్పుడు, ఇంజిన్‌ వేడిగా ఉన్నప్పుడు వెంటనే చార్జింగ్‌ పెట్టకూడదు. అపార్ట్‌మెంట్లలో చార్జింగ్‌ పాయింట్ల వద్ద నాణ్యమైన వైరింగ్‌, తగిన సర్క్యూట్‌ బ్రేకర్లు ఉండేలా చూసుకోవాలి.

ఎలక్ట్రిక్‌ వాహనాల ఫైర్‌సేఫ్టీ

Advertisement
 
Advertisement
Advertisement