వెల్గటూర్: రైలు కింద పడి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని జగదేవుపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరా ల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి శివకుమార్ (18) నిజామాబాద్‌లో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మంగళవా రం రాత్రి కళాశాల హాస్టల్ నుంచి వ్యక్తిగత పని ఉందని చెప్పి బయటికి వెళ్లాడు. నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలపగా వారు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్..
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట గాంధీనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్(40) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ తెలిపారు. ఎస్‌హెచ్‌వో వివరాల మేరకు.. గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆటో సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తరచూ ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు అధికమై జీవితంపై విరక్తి చెంది శ్రీకాంత్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతడి భార్య వెంటనే కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించింది. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
యువకుడి బలవన్మరణం
చిగురుమామిడి: మండల కేంద్రానికి చెందిన చొప్పదండి అభిలాష్(22) అనే యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. అభిలాష్ ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదివి ఇంటి వద్దే ఉంటూ వెల్డింగ్ పనులకు వెళ్లేవాడు. నెల రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు మందలించినా.. తన ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన అభిలాష్‌ను తండ్రి మందలించాడు. ఇది మనసులో పెట్టుకొని బుధవారం వేకువజామున చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృధ్వీధర్‌గౌడ్ తెలిపారు.


