భైంసాటౌన్/ఎల్లారెడ్డిపేట: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన వైద్యుడు, నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడి సురేందర్(50) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. బైంసాలోని తన ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఓ రోగికి వైద్యసేవలు అందిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.
పేద కుటుంబం నుంచి..
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్‌దాస్‌పేటకు చెందిన జీడి సాయిలు, పోశవ్వ దంపతుల కుమారుడు జీడి సురేందర్. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివిన సురేందర్ ఎల్లారెడ్డిపేట నుంచి మొట్టమొదటి డాక్టర్‌గా పట్టా అందుకున్నారు. బైంసా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించే పేదల డాక్టర్‌గా పేరు గడించారు. సురేందర్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ప్రీతి, అవంతిక. ఒకరు హైదరాబాద్‌లో మెడిసిన్ చదువుతుండగా, చిన్న కూతురు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. డాక్టర్ హఠాన్మరణంపై పట్టణ ప్రముఖులతోపాటు వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పిల్లల అక్రమ రవాణా కేసులో ఆర్‌ఎంపీ అరెస్టు
మల్యాల: దేశవ్యాప్తంగా నవజాత శిశువుల విక్రయం కేసులో మండలంలోని మద్దుట్లకు చెందిన ఓ ఆర్‌ఎంపీని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నవజాత శిశువులను పిల్లలు లేని వారికి ఒక్కో చిన్నారిని రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో గుజరాత్ నుంచి వచ్చిన పోలీసులు మద్దుట్ల వాసిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆపరేషన్ దేవ్ పేరుతో పోలీసులు గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురిని అరెస్టు చేయగా.. వారిలో మద్దుట్లకు చెందిన వ్యక్తి ఉండడం స్థానికంగా కలకలం రేపింది.


