బదిలీల సందడి | - | Sakshi
Sakshi News home page

బదిలీల సందడి

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

సాధారణ బదిలీలకు కసరత్తు డిప్యూటేషన్లు రద్దు మూడేళ్లు దాటితే స్థానచలనమే మే 1నుంచి సీనియారిటీ, ఖాళీల ప్రదర్శన మే 31నాటికి బదిలీ ఉత్తర్వులు

కరీంనగర్‌ అర్బన్‌: అధికారులు, ఉద్యోగుల బదిలీ కల త్వరలోనే నెరవేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు షెడ్యూల్‌ ప్రకటించడంతో కసరత్తు మొదలైంది. రెండేళ్ల తరువాత సాధారణ బదిలీలు జరుగుతుండటంతో శాఖలవారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాతో పాటు తప్పనిసరి బదిలీ అయ్యేవారి జాబితా రూపొందిస్తున్నారు. ప్రతిశాఖలో బదిలీల సందడి నెలకొనగా ఎవరెక్కడికి బదిలీ అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. అటెండర్ల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు స్థానచలనం తప్పనిసరి కావడంతో పలువురు పైరవీలు మొదలుపెట్టగా, మరికొందరు ఆదృష్టాన్ని విశ్వసిస్తున్నారు. సంబంఽధిత హెచ్‌వోడీలు మే 1నుంచి 7వరకు ఖాళీల ప్రదర్శన, సీనియారిటీ జాబితాతో పాటు బదిలీ తప్పనిసరి అయ్యేవారి జాబితా ఏర్పాటు చేయనున్నారు.

మొదలైన పైరవీలు

పట్టణాలు, కలెక్టరేట్‌ను వీడని అధికారులు, ఉద్యోగులు పైరవీలు ప్రారంభించారు. తమకున్న పలుకుబడి, రాజకీయ నేపథ్యాలతో పాటు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. త మకు అనుకూలమైన ప్రాంతానికి పోస్టింగ్‌ కల్పించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులతో పాటు రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి కీలక స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈ లు, ఏవోలు, ఏపీవోలతో పాటు ఇరిగేషన్‌, డీఆర్డీ వో, తదితరశాఖలవారు ప్రయత్నాలు చేస్తున్నారు.

తప్పని స్థానచలనం.. పలువురికి మినహాయింపు

సాధారణ బదిలీల్లో భాగంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మూడేళ్లు ఒకే చోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హులు. నాలుగేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. గరిష్టంగా 40శాతం ఉద్యోగులకు మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. మే 31 2027కి ముందు రిటైర్డ్‌ అయ్యేవారికి బదిలీ ఉండదు. ఎక్కువమంది ఒకే చోట కోరితే స్పౌజ్‌ కేటగిరితో పాటు 70శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్స్‌ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వనున్నారు. శాఖల వారీగా హెచ్‌వోడీ సంబంఽధిత ఉద్యోగుల సీనియారిటీ జాబితా ప్రచురించాలి. అధికారులు, ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్లు తీసుకోనున్నారు. బదిలీల గైడ్‌లైన్స్‌ వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్‌, రవాణా, విద్య, అటవీ, పోలీసుశాఖలకు వర్తించవని స్పష్టం చేసింది.

కేడర్‌ వారీగా బదిలీల బాధ్యతలు

బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టీజోన్‌, జోనల్‌, జిల్లా కే డర్‌గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నా రు. రాష్ట్రస్థాయిలో పోస్టులకుశాఖకు ప్రత్యేక ప్రధా న కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనుండగా హెచ్‌వోడీ కన్వీనర్‌గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. మల్టీజోనల్‌, జోనల్‌ స్థాయి పోస్టు ల బదిలీలకు హెచ్‌వోడీ చైర్మన్‌గా కార్యదర్శి సూ చించినవారు సభ్యులుగా, హెచ్‌వోడీ సూచించినవారు కన్వీసర్‌గా వ్యవహరించనుండగా జిల్లా కేడర్‌ పోస్టులకు కలెక్టర్‌ చైర్మన్‌గా అదనపు కలెక్టర్‌, డీఆర్వో సభ్యులుగా ఉండనుండగాశాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

జిల్లాలో ఉద్యోగులిలా

గెజిటెడ్‌ అధికారులు: 1,155

నాన్‌గెజిటెడ్‌ అధికారులు: 6,295

నాలుగో తగరతి ఉద్యోగులు: 1,157

మొత్తం ఉద్యోగులు: 8,607

బదిలీ షెడ్యూల్‌ ఇదీ

మే 1నుంచి 7: ఉద్యోగులు/ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితా

8 నుంచి 15: ఉద్యోగుల ఆప్షన్లతో కూడి దరఖాస్తుల స్వీకరణ

16 నుంచి 24 వరకు: దరఖాస్తుల పరిశీలన, మాస్టర్‌ లిస్ట్‌ తయారీ

25 నుంచి 31: బదిలీ ఉత్తర్వులు, తదుపరి మూడు రోజుల్లో విధుల్లో చేరిక

Advertisement
 
Advertisement
Advertisement