మే 11 నుంచి ఇండ్ల గణన వివరాలు గోప్యంగా ఉంచాలి కలెక్టర్ చిత్రా మిశ్రా
కొత్తపల్లి: ప్రజల సహకారంతో పార్టీలకతీతంగా అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతూ కరీంనగర్ రూపురేఖలు మార్చుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమృత్ 2.0 కింద రూ.1,98 కోట్ల నిధులతో రేకుర్తి పెంటకమ్మ చెరువు సుందరీకరణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, స్థానిక కార్పోరేటర్లు సుదగోని మాధవి, పర్వతం మల్లేశంతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రూ.5.82 కోట్ల అమృత్ 2.0 నిధులతో నగరానికి దగ్గరున్న తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, రేకుర్తి చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్‌రావు, బండ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్, ఎన్నం ప్రకాశ్ పాల్గొన్నారు.
తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు
చొప్పదండి: జనగణన– 2027ను పారదర్శకంగా చేపట్టాలని, తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఏర్పాటు చేసిన మొదటి విడుత శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిజిటల్ సర్వేపై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. గతంలో సర్వే చేసిన సిబ్బంది అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, జూన్ 9 వరకు పూర్తి చేయాలన్నారు. అధికారులు ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని సూచించారు. వివరాలు గోప్యంగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచాలి
విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వసతి గృహాలను నిర్వాహకులు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానా.ఈ వాకడే కోరారు. మంగళవారం పట్టణంలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాస్టల్‌లోనే ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీపీవో జగదీశ్వర్, తహసీల్దార్ నవీన్ కుమార్, వార్డెన్ కుమారస్వామి పాల్గొన్నారు.
పక్కాగా ధాన్యం కొనుగోలు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 31 కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులు కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.


