కొత్త పనులకు సీడీఎంఏ ఓకే పాత రూ.50 కోట్ల టెండర్ రద్దు 87 ప్రతిపాదనలకు పరిపాలనా అనుమతులు మంజూరు ప్రతి డివిజన్‌లో ఇక అభివృద్ధి పనులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పాలకవర్గం ప్రతిపాదించిన పాత పనుల రద్దు, కొత్త ప్రతి పాదనలను సీడీఎంఏ అంగీకరించింది. రూ.50 కోట్లతో 87 పనులు చేపడుతూ పిలిచిన పాత టెండర్‌ను రద్దు చేస్తూ, రూ.50 కోట్లతో 87 పనుల కొత్త ప్రతిపాదనలకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. దీంతో సాంకేతికపరమైన అనుమతులు తీసుకొని టెండర్ ప్రక్రియచే పట్టేందుకు నగరపాలకసంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు.
87 పనులకు ఓకే
రూ.50 కోట్లతో నగరంలోని 66 డివిజన్లలో పాలకవర్గం ప్రతిపాదించిన 87 అభివృద్ధి పనులకు సీడీఎంఏ పరిపాలనా మంజూరు ఇచ్చింది. కొత్త పాలకవర్గం కొలువు తీరిన తరువాత నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులు జరగాలనే ఆలోచనతో పాత టెండర్‌ను రద్దు చేసి కొత్త ప్రతిపాదనలు రూపొందించడం తెలిసిందే. 66 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 87 పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం ఇటీవల ఏకగ్రీవంగా తీర్మాణించింది.
పాత టెండర్ రద్దు
నగరపాలకసంస్థలో అసాధారణ రీతిలో టెండర్ ప్రక్రియ మధ్యలో రద్దయింది. విలీన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ, ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్ల యూఐడీఎఫ్ (అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్‌మెంట్ ఫండ్) నిధులతో 87 పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రూ.50 కోట్లలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాటా రూ.40 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10 కోట్లు. 87 పనులకు టెండర్ పిలవగా, 25 పనులకు కాంట్రాక్టర్లు స్పందించలేదు. 62 పనుల్లో 21 పనులకు సంబంధించి టెండర్ ఓపెన్ చేశారు. ఆ సమయంలోనే నగరపాలకసంస్థ ఎన్నికలు రావడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త పాలకవర్గం కొలువు తీరిన అనంతరం కొన్ని డివిజన్లకే పరిమితమైన రూ.50 కోట్ల పనులను నగరవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. దీంతో పాత టెండర్లను రద్దు చేస్తూ, కొత్తగా 66 డివిజన్లలో 87 పనుల కొత్త ప్రతిపాదనలను కార్పొరేటర్ల అందించారు. గత నెల 31వ తేదీన నిర్వహించిన బల్దియా సర్వసభ్య సమావేశంలో పాత టెండర్ రద్దు, కొత్త పనుల ప్రతిపాదనలను ఆమోదిస్తూ తీర్మాణం చేశారు. టెండర్ల రద్దు అప్పట్లో రాజకీయ రగడకు కారణమైనా, ఆ తరువాత అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో పాత టెండర్లు రద్దు చేస్తూ, కొత్తగా 87 పనులకు ఆమోదం తెలుపుతూ సీడీఎంఏ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త పాలకవర్గం పంతం నెగ్గించుకున్నట్లయింది. పనులకు సాంకేతిక పరమైన అనుమతులు తీసుకొని, టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మే నెలలో పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.


