వివరాల సేకరణలో పొరపాట్లు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

వివరాల సేకరణలో పొరపాట్లు చేయొద్దు

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

● జనగణన శిక్షణ తరగతుల్లో నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: జనగణన సందర్భంగా వివరాల సేకేరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అన్నారు. నగరంలో జనగణన చేపట్టబోయే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో సోమవారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణా తరగతులను సందర్శించిన కమిషనర్‌ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలన్నారు. హౌస్‌ లిస్టు బ్లాక్‌ల ప్రకారం ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలన్నారు. ప్రణాళిక ప్రకారం జనగణన చేపట్టి ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సమాచారం తెలిపేలా ప్రోత్సహించాలని సూచించారు. 666 హౌజ్‌ లిస్ట్‌ బ్లాక్‌ల ప్రకారం 855మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు జనగణన చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీలు వేణు, శ్రీధర్‌,జనగణన ట్రైనర్లు పాల్గొన్నారు.

బల్దియా ప్రజావాణికి 22 దరఖాస్తులు

నగరపాలక సంస్థ ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 22 దరఖాస్తులు రాగా, ఇందులో ఇంజినీరింగ్‌ 6, టౌన్‌ ప్లానింగ్‌ 10, రెవెన్యూ విభాగంలో ఆరు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను సెక్షన్లవారీగా సంబంధిత అధికారులు పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కమిషనర్‌ సువార్త, డిప్యూటి కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement