డంప్‌యార్డ్‌పై బీజేపీ ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

డంప్‌యార్డ్‌పై బీజేపీ ఉద్యమం

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

డంప్‌యార్డ్‌పై బీజేపీ ఉద్యమం ● కార్యాచరణపై హుజూరాబాద్‌ నేతలతో బండి సంజయ్‌ భేటీ

కరీంనగర్‌: హుజూరాబాద్‌ శివారులో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలు సహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు సోమవారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్‌ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ డంపింగ్‌ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్‌ ప్రజలకు మద్దతుగా బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. కలెక్టర్‌ నుంచి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసన తెలియజేయాలని కోరారు. మంగళవారం హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement