కరీంనగర్‌టౌన్: కేసీఆర్ బయటకొస్తున్నాడంటే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ ఆదివారం మార్గంమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఘనంగా జరుగుతుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు.. ప్రజల్లోకి రావడం లేదని పదేపదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, కేసీఆర్ బయటకు వస్తుండు అంటే వణికిపోతున్నారన్నారు. కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతుభరోసా నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక హామీల అమలును మరిచిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పొన్నం అనిల్ కుమార్‌గౌడ్, ఐలేందర్ యాదవ్, గందె మహేశ్ పాల్గొన్నారు.


