మిల్లింగ్ చార్జీలు ఇచ్చేందుకు ససేమిరా పూచీకత్తు లేనివారికే చార్జీలు సీఎంఆర్ గడువు పొడిగింపు
కరీంనగర్ అర్బన్: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను పక్కాగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత అనుభవాల క్రమంలో రైస్‌మిల్లర్లు మోసం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినతరం చేసింది. తాజాగా మిల్లింగ్ చార్జీలను విడుదల చేయగా బకాయిదారులకు షాక్ ఇచ్చింది. సీఎంఆర్ బకాయిదారులకు మిల్లింగ్ చార్జీలు నిలిపివేయగా హామీపత్రాన్ని తెరపైకి తెచ్చింది. డిఫాల్టర్లకు తోడూ బకాయిదారులకు పూచీకత్తు ఇచ్చినవారికి చార్జీలు ఇవ్వమని తేల్చేసింది. జిల్లాలో దాదాపు 60మిల్లులకు మిల్లింగ్ బకాయిలు విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో బకాయిదారులకు రావాల్సిన సొమ్ముపై రైస్‌మిల్లర్ల సంఘం నేతలు ప్రయత్నాలు షురూ చేశారు.
అయిదేళ్ల మిల్లింగ్ బకాయిలు విడుదల
ఐదేళ్లుగా సీఎంఆర్ మిల్లింగ్ చార్జీలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఒక్కో మిల్లుకు సుమారు రూ.30లక్షల నుంచి 50లక్షల వరకు రావాల్సి ఉండగా, చాలాకాలంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత వారం సీఎంఆర్ ధాన్యం కేటాయించే సమయంలో మిల్లర్లు ఇవ్వాల్సిన గ్యారంటీల్లో పౌరసరఫరాలశాఖ నూతన విధానాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మిల్లర్లు నూతన విధానాలను వ్యతిరేకిస్తూ యాసంగి ధాన్యం దించుకునేందుకు ఒప్పుకోకపోవడంతో మిల్లర్లతో చర్చలు జరపాలని ప్రభుత్వం పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. అధికారులు, మిల్లర్లు సమావేశం కాగా గ్యారంటీలకు సంబంధించి పాత పద్ధతినే అమలు చేయాలని, మిల్లింగ్ చార్జీల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటికి పౌరసరఫరాల శాఖ అంగీకరించగా చర్చల వివరాలు ప్రభుత్వానికి నివేదించగా రూ.200 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. మిల్లింగ్ చార్జీల బకాయిలు పొందాలనుకునే మిల్లర్లు ముందుగా ఏ సీజన్‌లోనూ డిఫాల్టర్ కాలేదని, బకాయిదారులకు పూచీకత్తు లేనని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మిల్లర్లు అదనంగా బకాయిలు ఉండి మిల్లింగ్ చార్జీలు తీసుకున్నట్లయితే వాటిని రాబట్టుకునేందుకు అంగీకరిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
సీఎంఆర్ గడువు పొడిగింపు
2024–25 యాసంగి సీఎంఆర్ గడువును కేంద్రం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు ఈనెల 17న వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, పౌరసరఫరాలశాఖకు ఉత్తర్వులు అందాయి. మిల్లర్ల యజమానులు సీఎంఆర్‌ను మిల్లర్ల యజమానులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పూర్తిగా చెల్లించాలని పేర్కొనగా గడువు పెంచుతూ ఉత్తర్వులు వచ్చినట్లు పౌరసరఫరాల అధికారులు వివరించారు. రీసైక్లింగ్ కాకుండా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్‌సీఐని కేంద్రం కోరింది. కేంద్రాల నుంచి తరలించే వాహనాలకు జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది.


