జగిత్యాలటౌన్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి హాజరుకానున్న ప్రజాఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభావేదికపై కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సభ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, దావ వసంత తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జీవన్‌రెడ్డి ఫ్లెక్సీ చించివేత.. అనుచరుల నిరసన
మరికొన్ని గంటల్లో సభ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్, జీవన్‌రెడ్డి కలిసి ఉన్న ఫ్లెక్సీలో జీవన్‌రెడ్డి ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపింది. సభ విజయవంతం కోసం జీవన్ అనుచరులు పాత బస్టాండ్ చౌరస్తాలో కేసీఆర్, జీవన్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జీవన్‌రెడ్డి ఫొటోను మాత్రమే చించివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి అనుచరులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాఆశీర్వాద సభ కోసం పలుచోట్ల మినీస్టేడియం గోడలు కూల్చివేయడం చర్చనీయాంశమైంది.


