కో ఆప్షన్‌పై కోర్టుకు | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌పై కోర్టుకు

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

● హైకోర్టులో మాజీ ఎంపీటీసీ పిటిషన్‌ ● పోటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ ● బల్దియా నిర్ణయంపై ఉత్కంఠ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ ఎన్నికల్లో పోటీకి తమకూ అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీటీసీ దాది సుధాకర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు సంబంధించిన సర్క్యులర్‌లో మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లకు మాత్రమే అవకాశం ఉండగా, మాజీ ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వలేదు. నగరపాలకసంస్థ పరిధిలోని మాజీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లకు పోటీచేసేందుకు అవకాశం కల్పించినప్పుడు, అదే గ్రామాల నుంచి ప్రజలతో ఎన్నికకాబడిన తమకు ఎందుకు అవకాశం ఇవ్వరంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారంతో దరఖాస్తుల స్క్రూటీ ముగియనుండగా, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

హైకోర్టులో పిటిషన్‌

నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్‌ పదవులకు నోటిఫికేషన్‌ వెలువడడం, ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం తెలిసిందే. ఐదు స్థానాలకు గాను రెండు మైనార్టీలకు, మూడు జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. మూడు జనరల్‌లో ఒకటి మహిళకు రిజర్వ్‌ చేశారు. జనరల్‌ కోటాలోని మూడు స్థానాలకు మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నగరపాలకసంస్థ పరిధిలోని (విలీన గ్రామపంచాయతీలు) మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారులు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు అర్హులు. మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు, అవే గ్రామాల నుంచి తాము ప్రజలతో ఎన్నుకోబడిన మాజీ ప్రజాప్రతినిధులమని తమకు పోటీకి అవకాశం ఇవ్వాలని బొమ్మకల్‌ మాజీ ఎంపీటీసీ దాది సుధాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ (డబ్లూపీ.1166/2026) దాఖలు చేశారు. తాము ఇప్పటికే దరఖాస్తులు దాఖలు చేశామని, తమను పోటీకి అర్హులుగా ప్రకటించాలని కోరారు.

నిర్ణయంపై ఉత్కంఠ

కో ఆప్షన్‌ పదవులకు ప్రస్తుతం నగరపాలకసంస్థలో ఉన్న, గతంలో గ్రామపంచాయతీలైన బొమ్మకల్‌, చింతకుంట, పద్మనగర్‌లకు చెందిన మాజీ ఎంపీటీసీలు ముగ్గురు దరఖాస్తు చేసుకొన్నారు. ఐదు స్థానాలకు మొత్తం 46 దరఖాస్తులు రాగా, ఆదివారంతో పరిశీలన ముగియనుంది. దరఖాస్తులు ఆమోదం పొందాయా, తిరస్కరించారా అనేది అధికారులు ఎప్పుడు వెల్లడిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముందుగా చెప్పాలని ఏమీ లేదని, ఓటింగ్‌ సమయంలోనే తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు చెబుతామంటుండడం సమస్యను జఠిలం చేస్తోంది.

క్లారిటీ తీసుకుంటాం

కో ఆప్షన్‌ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరహాలో ఉండవు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ముందుగా తిరస్కరించిన దరఖాస్తుల వివరాలు చెప్పాలని ఎక్కడా లేదు. ఆమోదం పొందిన దరఖాస్తుల వివరాలను ఓటింగ్‌ సమయంలో కౌన్సిల్‌ ఎదుట ఉంచుతాం. మాజీ ఎంపీటీసీ ఒకరు కోర్టుకు వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. కో ఆప్షన్‌ ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌లోనే ఎంపీటీసీలకు అవకాశం లేదు. అయినప్పటికీ ముందుగా వివరాలు వెల్లడించాలా లేదా అనే అంశంపై క్లారిటీ తీసుకుంటాం.

– ప్రఫుల్‌దేశాయ్‌, కమిషనర్‌, నగరపాలకసంస్థ

Advertisement
 
Advertisement
Advertisement