జనగణన పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పకడ్బందీగా చేపట్టాలి

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పట్టణప్రణాళిక అధికారులు, జనగణన శిక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో చేపట్టబోయే జనగణనను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 666 హౌస్‌ లిస్ట్‌ బ్లాక్‌ల ప్రకారం గుర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు మూడు విడుతలుగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ట్రైనర్లకు సూచించారు. గుర్తించిన 855 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు బ్యాచ్‌లవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దీన్‌, డీసీపీ బషీరొద్దీన్‌, ఏసీపీలు వేణు, శ్రీధర్‌, ఎంహెచ్‌వో సుమన్‌, జనగణన ట్రైనర్‌ సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల తనిఖీ

కరీంనగర్‌ సిటీ: డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఫలితాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని శాతవాహన వీసీ ఉమేశ్‌ కుమార్‌ తెలిపారు. వర్సిటీ పరిధిలోని పలు కళాశాలల్లో జరుగుతున్న రెండో సెమిస్టర్‌ పరీక్ష కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద, అపూర్వ మహిళా డిగ్రీ కళాశాలను పరీక్షల నియంత్రణాధికారి డి.సురేశ్‌ కుమార్‌తో కలిసి సందర్శించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ పరీక్షల్లో 12,083 మంది విద్యార్థులకు గాను 534మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

దరఖాస్తులు ఆహ్వానం

కరీంనగర్‌ టౌన్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా టెక్నికల్‌ శిక్షణ సంస్థలో మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు తల్లిదండులను కోల్పోయిన, అక్రమ రవాణాకు గురైన, దివ్యాంగ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కోర్సులో 60సీట్లకు మొత్తం 360 సీట్లలో 70శాతం కేటాయించబడతాయన్నారు. పాలిటెక్నిక్‌ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, దివ్యాంగులకు 3శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పించడం జరుగుతుందని, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని 2వ అంతస్తులోగల బాల రక్ష భవన్‌లో లభించే దరఖాస్తుఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి మే 23, 2026 లోగా సమర్పించాలని, వివరాలకు 94908 81098 నంబరును సంప్రదించాలని సూచించారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్వహణతో పాటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 33/11 కె.వీ.శాతవాహన విశ్వవిద్యాలయ సబ్‌స్టేషన్‌ పరిధిలోని చింతకుంట, కమాన్‌పూర్‌, మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.బ్యాంక్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలోని సీతారాంపూర్‌, సూర్యనగర్‌, బాలాజీనగర్‌, సాయిబాలాజీనగర్‌, ఆర్టీసీ కాలనీ, జగిత్యాల రోడ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

సభ విజయవంతం చేయాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాటారంలో ఈనెల 20న జరుగనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌ రావు ఒక ప్రకటనలో కోరారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సభకు తరలిరావాలని పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన

ఎస్‌యూ వీసీ ఉమేశ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement